Aug 07,2023 08:32
  • సెప్టెంబర్‌ 1 నుంచి 7వరకు ఆందోళనలు
  • బిజెపిని ఏకాకిని చేసి ఓడించేందుకు ఉమ్మడి కృషి
  • రాష్ట్ర స్థాయిల్లోనే సీట్ల సర్దుబాటు
  • ఎస్‌కెఎం, కార్మిక సంఘాల ఆందోళనకు మద్దతు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ధరల పెరుగుదల, అంతులేని నిరుద్యోగంపై సెప్టెంబరు 1 నుండి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించనున్నట్లు సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. మూడు రోజుల పాటు హరికిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ (హెచ్‌కెఎస్‌) భవన్‌లో జరిగిన సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. అనంతరం కేంద్ర కమిటీ నిర్ణయాలను ఏచూరి మీడియాకు వెల్లడించారు. మోడీ ప్రభుత్వం దేశాన్ని అసాధారణ ఆర్థిక అస్తవ్యస్థ స్థితిలోకి నెట్టిందని ఆయన అన్నారు. ప్రజల జీవనోపాధి తదితర సమస్యలపై వామపక్షాలతో చర్చించి, ఆందోళన కార్యక్రమం రూపొందిస్తామని తెలిపారు. కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ, సంయుక్త కిసాన్‌ మోర్చా ఉమ్మడిగా పిలుపు ఇచ్చిన ఆందోళనలకు కేంద్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని పేర్కొన్నారు. మహిళ, చిన్నారులపై అత్యాచార దాడులు పెరిగిపోతుండడం పట్ల కేంద్ర కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందని, మహిళ సంఘం నిర్వహించే ర్యాలీకి మద్దతు ప్రకటించిందని తెలిపారు.
 

                                                             బిజెపి వ్యతిరేక ఓటు చీలకుండా వ్యూహ రచన

ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై చర్చించాం. వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఏకాకిని చేసి ఓడించడానికి అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహం గురించి చర్చించామని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన సంప్రదింపులు జరుగుతున్నాయని. ముంబయిలో ఆగస్టు 31, సెప్టెంబర్‌ 1న జరగబోయే ఇండియా వేదిక సమావేశంలో మరిన్ని పార్టీలు చేరే అవకాశం ఉందని తెలిపారు. కూటములు, పొత్తులు, సీట్ల పంపకాలు, అవగాహనలు ఏవైనా రాష్ట్ర స్థాయిల్లోనే ఉండాలని అన్ని పార్టీలు అంగీకరించాయని అన్నారు. రాష్ట్ర స్థాయిల్లో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నందున తదనుగుణంగా బిజెపి వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు వ్యూహ రచన చేస్తున్నామన్నారు. కేరళలో ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌ మధ్య పోటీ ఉంది. పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష కూటమి, కాంగ్రెస్‌, ఇతర లౌకిక పార్టీలు టిఎంసి, బిజెపిలతో తలపడను న్నాయి. బీహార్‌లో మహా కూటమి, మహారాష్ట్రలో మహా వికాస్‌ అగాధీ, తమిళనాడులో లౌకిక కూటమి ఇలా ప్రతి రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర స్థాయిల్లో బిజెపి వ్యతిరేక ఓటును గరిష్టం చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. బిజెపి వ్యతిరేక ఓటును సమన్వయం చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు చేసుకున్న ఒప్పందమే భారత్‌ కుటమి. లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిల్లో ఎటువంటి కూటమి లేదని ఆయన తెలిపారు.