Feb 24,2023 22:16

దుబాయ్: బోర్డర్‌గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఇప్పటివరకు జరిగిన నాగపూర్‌, ఢిల్లీ టెస్టు పిచ్‌లకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) రేటింగ్స్‌ ప్రకటించింది. ఈ రెండు పిచ్‌లకు ఐసిసి యావరేజ్‌(సగటు) రేటింగ్‌ ఇచ్చినట్లు సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ గురువారం ఓ కథనంలో పేర్కొంది. ఐసిసి మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌(జింబాబ్వే) ఈ రిపోర్టును ఇచ్చినట్లు తెలుస్తోంది. నాగపూర్‌లోని విదర్భ క్రికెట్‌ సంఘం స్టేడియం పిచ్‌ యావరేజ్‌గా ఉన్నట్లు ఆండీ పైక్రాఫ్ట్‌ తెలిపారు. టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభానికి ముందు ఇరుజట్ల ప్రదర్శనపై భారీ అంచనాలున్నా.. తొలి రెండు టెస్ట్‌ల ఫలితాలు మూడు రోజుల్లోనే వచ్చాయి. తొలి టెస్టులో ఇండియా ఇన్నింగ్స్‌ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ మూడవ రోజే ముగిసింది. ఆ పిచ్‌కు కూడా యావరేజ్‌ రేటింగ్‌ ఇచ్చాడు పైక్రాఫ్ట్‌. నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ ఇప్పటికే 2-0 ఆధిక్యతలో ఉండగా.. మూడో టెస్టు మార్చి ఒకటినుంచి ఇండోర్‌ వేదికగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
స్మిత్‌కు పగ్గాలు
మూడో టెస్టుకు కమిన్స్‌ దూరం
ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌.. ఇండోర్‌లో జరిగే మూడో టెస్టుకు దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో రెండో టెస్టు ముగిసిన అనంతరం ఆస్ట్రేలియాకు బయల్దేరిన కమిన్స్‌.. మూడో టెస్టు ప్రారంభం నాటికి తిరిగి భారత్‌కు చేరుకోవడం కష్టమేనని క్రికెట్‌ ఆస్ట్రేలియా(సిఏ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే ఇండోర్‌ వేదికగా మార్చి ఒకటి నుంచి జరిగే మూడో టెస్టుకు స్టీవ్‌ స్మిత్‌ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తాడని ఆ ప్రకటనలో వెల్లడించింది. కమిన్స్‌.. తన తల్లి ఆరోగ్యం బాగోలేదని బోర్డుకు తెలిపాడని, క్రికెట్‌ ఆస్ట్రేలియా, జట్టు సభ్యుల నుంచి తనకు మద్దతు లభించిందని, దానికి అతడు కృతజ్ఞతలు తెలిపాడని సిఏ తెలిపింది. స్మిత్‌ కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రస్తుతం దుబారులో ఉన్నా.. మూడో టెస్ట్‌ ప్రారంభం నాటికి భారత్‌కు చేరుకోనున్నాడు.