Jul 10,2023 10:35
  • నిధులు మంజూరులో జాప్యం
  • గత 3 నెలల్లో రూ.255 కోట్లే మంజూరు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మన బడి నాడు-నేడు రెండో దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2021లో చేపట్టిన పనులు ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. 22,266 పాఠశాలల్లో రెండో దశ నాడు-నేడు కింద మౌలిక వసతులు, అదనపు తరగతి గదులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే వీటిల్లో 22,220 పాఠశాలలకు పాఠశాల విద్యాశాఖ అనుమతులు ఇచ్చింది. వీటిలో 22,152 పాఠశాలల్లో పనులు ప్రారంభమయ్యాయి. ఈ పాఠశాలల్లో 9 రకాల పనులకు మొత్తం రూ.7,983 వేలకోట్లతో అంచనా వేసింది. నిధులు విడుదల కాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఏప్రిల్‌ 9 నాటికి రూ.2,544 కోట్లు పాఠశాల విద్యాశాఖ మంజూరు చేసింది.
             గడిచిన మూడు నెలల్లో కేవలం రూ.255 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. ఏప్రిల్‌ 9 నాటికి రూ.1,768 కోట్ల పనులు పూర్తవ్వగా, ఇప్పటికి రూ.2,781 కోట్ల పనులు పూర్తయ్యాయి. ఇంకా రూ.5,202 కోట్ల పనులు పూర్తికావాల్సి ఉంది. పాఠశాలలు ప్రారంభం నాటికే పూర్తికావాల్సిన పనులు ఇప్పటికీ పూర్తికాలేదు.
         బడులు ప్రారంభించిన సమయంలో కొంత మేర పనులు జరిగాయి. ఇప్పుడు నిధులు లేకపోవడంతో అవి నిలిచిపోయాయి. సిఎం సొంత నియోజకవర్గం పులివెందులలోని బాలికల ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీరు, ఫర్నీచర్‌, రంగులు వేసేందుకు రూ.7.15లక్షలతో అంచనా వేశారు. ఇప్పటి వరకు ఒక్క పని కూడా ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో నాడు-నేడు పనులను డిసెంబరు-జనవరి నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి శనివారం పాఠశాల విద్యపై నిర్వహించిన సమీక్షలో చెప్పారు. సివిల్‌ పనులు ఇంత వరకు 38శాతం పూర్తయ్యాయని, మొత్తం పనులను డిసెంబరు నాటికి పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ మౌలిక సదుపాయాల కమిషనరు భాస్కర్‌ పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను తరలించిన ఉన్నత పాఠశాలల్లో గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు పాఠశాలల పని వేళల్లో నిర్మాణ పనులు జరగడం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. అలాగే నిధులు విడుదల చేయకుండా పనులు సకాలంలో ఎలా పూర్తి చేయాలని పాఠశాలల తల్లిదండ్రుల కమిటీలు, ప్రధానోపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

44