Mar 27,2023 09:36
  •  ఫైనల్లో ఢిల్లీపై 7 వికెట్లతో గెలుపు

ముంబయి : మహిళల ముంబయి ఇండియన్స్‌ జట్టు సత్తా చాటింది. తొలిసారిగా నిర్వహించిన మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపిఎల్‌) టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 7 వికెట్ల తేడాతో విజయదుందుభి మోగించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఢిల్లీ విధించిన 132 పరుగులు లక్ష్యాన్ని ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగా మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో ఓపెనర్లు యాస్తికా భాటియా (4), హెయిలీ మాథ్యూస్‌ (13) నిరాశ పర్చినా నాట్‌సీవర్‌ బ్రంట్‌ (60 నాటౌట్‌, 55 బంతుల్లో ఏడు ఫోర్లు), కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (37, 39 బంతుల్లో ఐదు ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ తోడవ్వడంతో ముంబయి విజయం సాధించింది. హర్మన్‌ మూడో వికెట్‌గా రనౌట్‌కావడంతో క్రీజ్‌లోకి వచ్చిన అమీలా కేర్‌ (14) పరుగులతో అజేయంగా నిలిచింది. 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన ముంబయి 134 పరుగులతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (35, 29 బంతుల్లో ఐదు ఫోర్లు), శిఖా పాండే (27 నాటౌట్‌, 17 బంతుల్లో సిక్స్‌, మూడు ఫోర్లు), మినహా ఎవ్వరూ పెద్దగా రాణించలేదు. ముంబయి బౌలర్లలో వాంగ్‌, హెయిలీ మాథ్యూస్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. అమీలా కెర్‌ రెండు వికెట్లు సాధించారు. బ్రంట్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ మ్యాచ్‌ అవార్డు లభించింది.