Apr 16,2023 21:20

ముంబయి: ఐపీఎల్‌-16లో ముంబయి ఇండియన్స్‌కు వరుసగా రెండో విజయం. ఢిల్లీపై చివరి బంతి వరకు పోరాడి గెలిచిన ముంబయి.. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా.. వెంకటేశ్‌ అయ్యర్‌ (104బీ 51 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లు) శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ముంబయి 17.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇషాన్‌ కిషన్‌ (58బీ 25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అలరించాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (43బీ 25 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్స్‌లు), తిలక్‌ వర్మ (30బీ 25 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్‌) టిమ్‌ డేవిడ్‌ (24లిబీ 13 బంతుల్లో 1 ఫోరు, రెండు సిక్స్‌లు) రోహిత్‌ శర్మ (20బీ 13 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) సహకారం అందించడంతో ముంబయి సులభంగా విజయం సాధించింది. కోల్‌కతా బౌలర్లలో సుయాష్‌ శర్మ రెండు వికెట్లు తీయగా, ఠాకూర్‌, వరుణ్‌ చక్రవర్తి, ఫెర్గూసన్‌లు తలో వికెట్‌ దక్కించుకున్నారు.అంతకు ముందు.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. వెంకటేశ్‌ అయ్యర్‌ (104బీ 51 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లు) శతక్కొట్టాడు. ఆండ్రూ రస్సెల్‌ (21బీ 11 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) చివర్లో మెరుపులు మెరిపించాడు. శార్దూల్‌ ఠాకూర్‌ (13), రింకు సింగ్‌ (18) పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో హఅతిక్‌ షోకీన్‌ రెండు, కామెరూన్‌ గ్రీన్‌, డ్యూన్‌ జాన్‌సెన్‌, పీయూష్‌ చావ్లా, మెరిడిత్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.