ఆరు వికెట్ల తేడాతో చెన్నై గెలుపు
చెన్నై: చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరోసారి మెరిసింది. ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్)లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు ఆరు వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది. తొలుత చెన్నై పేసర్లు పథీరణ(3/15), దీపక్ చాహర్(2/18), దేశ్‌పాండే(2/26) సమిష్టిగా చెలరేగడంతో ముంబయి ఇండియన్స్ జట్టును 139పరుగులకే పరిమితం చేసి.. ఆ లక్ష్యాన్ని చెన్నై జట్టు 17.4ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాస్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ తొలిగా బౌలింగ్‌కే మొగ్గుచూపాడు. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయక చెన్నై బౌలర్ దేశ్‌పాండే ఓపెనర్ గ్రీన్(6)ను త్వరగా పెవీలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్(7), కెప్టెన్ రోహిత్(0)ను దీపక్ చాహర్ ఔట్ చేయడంతో ముంబయి జట్టు 14పరుగులకే 3వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో వథేరా(64) అర్ధసెంచరీకి తోడు సూర్యకుమార్ యాదవ్(26) కొంతసేపు చెన్నై బౌలర్లకు ఎదురొడ్డి పోరాడారు. వీరిద్దరి నిష్క్రమణ తర్వాత స్టబ్స్(20) రాణించినా.. లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ముంబయి జట్టు నిర్నీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఛేదనలో చెన్నై ఓపెనర్లు డెవాన్ కాన్వే 44, రుతురాజ్ గైక్వాడ్ 30 పరుగులతో రాణించగా... రహానే 21 పరుగులు చేశాడు. అంబటి రాయుడు(12) విఫలమైనా.. శివమ్ దూబే (26 నాటౌట్) మూడు సిక్సర్లతో దూకుడు ప్రదర్శించాడు. ధోనీ ఆఖర్లో బ్యాటింగ్ వచ్చి సింగిల్ తీయడంతో చెన్నై సునాయాసంగా లక్ష్యానికి చేరువైంది. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లాకు రెండు, స్టబ్స్, ఆకాశ్ మధ్వాల్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పథీరణకు లభించింది.
స్కోర్‌బోర్డు..
ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్: గ్రీన్ (బి)దేశ్‌పాండే 6, ఇషాన్ కిషన్ (సి)తీక్షణ (బి)దీపక్ చాహర్ 7, రోహిత్ శర్మ (సి)జడేజా (బి)దీపక్ చాహర్ 0, నేహల్ వథేరా (బి)పథీరణ 64, సూర్యకుమార్ యాదవ్ (బి)జడేజా 26, స్టబ్స్ (సి)జడేజా (బి)పథీరణ 20, టిమ్ డేవిడ్ (సి)గైక్వాడ్ (బి)దేశ్‌పాండే 2, ఆర్షాద్ ఖాన్ (సి)గైక్వాడ్ (బి)పథీరణ 1, జోఫ్రా ఆర్చర్ (నాటౌట్) 3, చావ్లా (నాటౌట్) 2, అదనం 8. (20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 139పరుగులు.
వికెట్ల పతనం: 1/13, 2/13, 3/14, 4/69, 5/123, 6/127, 7/134, 8/137
బౌలింగ్: దీపక్ చాహర్ 3-0-18-2, దేశ్‌పాండే 4-0-26-2, జడేజా 4-0-37-1, మొయిన్ అలీ 1-0-10-0, తీక్షణ 4-0-28-0, పథీరణ 4-0-15-3.
చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: గైక్వాడ్ (సి)ఇషాన్ కిషన్ (బి)చావ్లా 30, కాన్వే (ఎల్‌బి)ఆకాశ్ మథ్వాల్ 44, రహానే (ఎల్‌బి)చావ్లా 21, అంబటి రాయుడు (సి)గోయల్ (బి)స్టబ్స్ 12, శివమ్ దూబే (నాటౌట్) 26, ధోనీ (నాటౌట్) 2, అదనం 5. (17.4 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 140పరుగులు.
వికెట్ల పతనం: 1/46, 2/81, 3/105, 4/130
బౌలింగ్: గ్రీన్ 1-0-10-0, జోఫ్రా ఆర్చర్ 4-0-24-0, అర్షాద్ ఖాన్ 1.4-0-28-0, పియూష్ చావ్లా 4-0-25-2, గోయల్ 4-0-33-0, స్టబ్స్ 2-0-14-1, ఆకాశ్ మథ్వాల్ 1-0-4-1.










