- వేల ఎకరాల అప్పగింతకు నిర్ణయం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పెట్టుబడుల ప్రోత్సాహక కార్కక్రమంలో భాగంగా ఇటీవల ఆమోదించిన అనేక కంపెనీలకు సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయం వెలుగు చూసింది. రూ.81 వేల కోట్ల పెట్టుబడుకు సంబంధించి పెట్టుబడులకు పెడతాయని సిఎం ప్రకటించిన వాటిల్లో ఎక్కువగా అధికార పార్టీకి చెందిన నాయకులవి లేదా వారి కుటుంబ సభ్యులు, లేదా బంధువులవేననే ప్రచారం జరుగుతోంది. కాకినాడలో ఏర్పాటు చేయనున్న లైఫిజ్ ఫార్మా అరబిందో అనుబంధ సంస్థ అనే ప్రచారం జరుగుతోంది. విశాఖపట్నంలో ఈ బోనంగిలో అరబిందో యాంటిబయాటిక్స్, లైఫిజ్ ఫార్మా కంపెనీల కార్యాలయాలు ఒకే చోట ఉన్నాయి. లైఫిజ్ ఫార్మాకు కాకినాడ సెజ్‌లో 236.37 ఎకరాలను సేకరించారు. నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద రూ.43,143 కోట్లతో 5147 ఎకరాల్లో వేర్వేరు ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్న ఇండోసోల్ సోలార్ సంస్థ పులివెందులకు చెందిన నారెడ్డి విశ్వేశ్వరరెడ్డి, వంశీరెడ్డికి చెందినదని తెలిసింది. వీరిలో విశ్వేశ్వరరెడ్డి పులివెందుల నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేశారు. పంప్డ్ హైడ్రో, సోలార్, విండ్‌పవర్ ప్రాజెక్టులు రూ.33,033 కోట్లతో ఏర్పాటు చేయనుంది. సోమశిల, ఎర్రవరం వద్ద కూడా రెండు పంప్డ్ స్టోరేజీ హైడ్రో ప్రాజెక్టులు పెట్టనుంది. వైఎస్‌ఆర్ జిల్లా వొంగిమల్లలో ఏర్పాటు చేయనున్న ఆస్త గ్రీన్ ఎనర్జీ వెంచర్స్‌లో డైరెక్టర్లుగా కేశవరెడ్డి, జయధీర్ ఉన్నారు. వీరు కూడా వైసిపి అనుకూలురని ప్రచారం జరుగుతోంది. కృష్ణా జిల్లా మల్లవల్లిలో మెగా ఫుడ్‌పార్కు ఏర్పాటు చేయనున్న అవిశా ఫుడ్ ప్రైవేటు లిమిటెడ్ మచిలీపట్నం ఎంపి వల్లభనేని బాలశౌరి కుటుంబానికి చెందినది. ఈ కంపెనీలో డైరెక్టర్లుగా అరుణ్‌శౌరి, అనుదీప్, అఖిల్ ఉన్నారు. వీరు ముగ్గురూ బాలశౌరి వారసులు. ఈ కంపెనీకి 11.64 ఎకరాలు కేటాయించారు. రూ.150 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు పెడతామని ముందుకు వచ్చిన అనేక కంపెనీలు ఆచూకీ లేకుండా పోయాయి. పెట్టుబడులు మాత్రం ఆశించినంతగా రాలేదు. కానీ భూములు మాత్రం ఎక్కువ సేకరించి తక్కువ ధరకు కట్టబెట్టారు. వీటిల్లో అనేక కంపెనీలు భూములను బ్యాంకుల్లో తాకట్టుపెట్టుకుని రుణాలు పొందాయి.










