ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : దేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే కేంద్రంలో మోడీని, రాష్ట్రంలో జగన్‌ను గద్దె దించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై చర్చించి కార్యాచరణ రూపొందించే పనిలో భాగంగా సోమవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన మేధావుల చర్చావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి నిరంకుశ విధానాలు అనుసరిస్తున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్యం అంటే విలువ లేకుండా పోయిందని పేర్కొన్నారు. వారిని అధికారంలో కొనసాగిస్తే దేశానికి, రాష్ట్రానికి భవిష్యత్ ఉండదని తెలిపారు.
రైతు సంఘం సీనియర్ నాయకులు వై.కేశవరావు మాట్లాడుతూ రైతుల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన నల్లచట్టాలను రద్దు చేసే వరకూ అలుపెరుగకుండా పోరాడామని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటాలు నిర్వహించాలని కోరారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ మోడీ, జగన్‌లకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని అన్నారు. ఆందోళనలకు పిలుపిస్తే అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి మూర్ఖపు ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు.
కేంద్రంలో బిజెపిని ఎవరు వ్యతిరేకిస్తారో స్పష్టత లేదు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన కేంద్రంలో బిజెపిని మోస్తున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు, చట్టాలను పార్లమెంటు లోపలా బయట టిడిపి, వైసిపిలు పూర్తిగా సమర్థిస్తున్నాయని తెలిపారు. కేంద్రంలో బిజెపి ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడుతూనే... రాష్ట్రంలోనూ ప్రజావ్యతిరేక విధానాలపై సిపిఎం పోరాడుతోందని తెలిపారు. అందులో భాగంగానే విద్యుత్ ఛార్జీలు, ఆస్తిపన్ను వంటి అన్ని విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం ఆందోళన చేస్తోందని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అంగన్‌వాడీలు న్యాయబద్ధమైన డిమాండ్లపై ఆందోళన చేస్తుంటే రాష్ట్రప్రభుత్వం నిర్బంధానికి పూనుకోవడం తీవ్రమైన విషయమని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు నిలబడతారనే విషయంలో రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు అవకాశవాదంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కేంద్రానికి మద్దతు ఇవ్వడం రాష్ట్ర హక్కులకు, ప్రజాస్వామ్యానికి, రాష్ట్రాభివృద్ధికి తీవ్ర నష్టమని తెలిపారు. బిజెపికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పార్టీలు అనుసరిస్తున్న అస్పష్ట విధానాల నేపథ్యంలో ఈ సమావేశంలో ప్రతిపాదించిన కార్యాచరణపై తమ పార్టీ రాష్ట్ర కమిటీలో చర్చించి చెబుతామని వై.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో జగన్ అరెస్టయినప్పుడు వైసిపి, చంద్రబాబు అరెస్టయినప్పుడు టిడిపి వాళ్లు ప్రజాస్వామ్య హక్కులు లేవంటున్నారని విమర్శించారు. సమస్యలపై కార్మికులు ఆందోళనలు చేస్తుంటే వారిని అరెస్టు చేసిన సమయంలో ఎవరూ మాట్లాడటం లేదని తెలిపారు. ప్రజాస్వామ్య హక్కులనేవి నాయకులకేగాదు అందరికీ ఉంటాయని గుర్తించాలని పేర్కొన్నారు. రైతు నాయకులు, మాజీ అధికారులు, ఇంజనీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.










