ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రజాస్వామ్యం, విలువల గురించి మన్‌కీబాత్‌లో ప్రధాని మోడీ మాట్లాడటం హాస్యాస్పదమని మాజీ మంత్రి, రైతు నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 1975లో విధించిన అత్యవసర పరిస్థితి గురించి మోడీ మాట్లాడటం చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని పేర్కొన్నారు. అప్పట్లో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇస్తే ఆమె ఎమర్జెన్సీ విధించారని తెలిపారు. ఇప్పుడు ప్రలోభాలు పెట్టి ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న మోడీ పౌరహక్కులు, పత్రికా స్వాతంత్య్రం లేకుండా చేస్తున్నారని విమర్శించారు. అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్న సామాజిక ఉద్యమకారులను వేధించడం దివైర్, కారవాన్, న్యూస్‌క్లిక్ లాంటి ప్రఖ్యాతమీడియా సంస్థలపైనా, జర్నలిస్టులపైనా తప్పుడు కేసులు పెట్టిస్తున్న మోడీ మాటలు కట్టిపెట్టాలని వడ్డే తెలిపారు. రుణాలు ఎగ్గొడుతున్న వారికే రుణాలు ఇప్పించాలని మోడీ ఆదేశించడం దుర్మార్గమని పేర్కొన్నారు. అప్రజాస్వామిక, అవినీతికర, రైతాంగ, సామాన్య ప్రజావ్యతిరేక మోడీ ప్రభుత్వానికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.










