ప్రజాశక్తి - ఉయ్యూరు (కృష్ణా జిల్లా) : సరిహద్దు తగాదాలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూసర్వేపై తొందరపాటు తగదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్, సిబిఐ మాజీ జెడి వి.లక్ష్మీనారాయణ, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకష్ణ అన్నారు. సర్వేలో పొరపాట్లు, తప్పులు వస్తే యజమానులు నష్టపోవడమేకాకుండా పరిష్కారం కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమగ్ర భూ సర్వే వల్ల ఉత్పన్నమయ్యే దుష్పరిణామాలపై కృష్ణాజిల్లా ఉయ్యూరులోని వడ్డే శోభనాద్రీశ్వరరావు నివాసంలో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. సర్వేకు పూర్తిస్థాయి శిక్షణనిచ్చిన సిబ్బందిని ఉపయోగించి క్షేత్రస్థాయిలో రైతుల సమక్షంలో తగిన వ్యవధి ఇచ్చి సర్వే చేయాలన్నారు. పొరపాట్లు జరిగేందుకు అవకాశం లేకుండా రూపొందించిన 'స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్' ప్రకారం సర్వే చేపట్టాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువచ్చేముందు దానిపై సమగ్ర అవగాహన కల్పించాలన్నారు. ఏవిధమైన అవగాహన లేకుండా సర్వే చేయించడం సబబుకాదని పేర్కొన్నారు. సర్వే సమస్యల పరిష్కారం నిమిత్తం మండల స్థాయిలో రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, సర్వేకు చెక్‌లిస్టులు తయారు చేయాలని సూచించారు. 17,584 గ్రామాల్లో డిసెంబరులోగా సర్వే పూర్తి చేయడం అసంభవమన్నారు. సమావేశంలో ఆర్థిక నిపుణులు ఏకాంబరం పాల్గొన్నారు.










