Jul 28,2023 11:14

గంజాయి మూలాలపై దృష్టి పెట్టాం
 ప్రతి జిల్లాలోనూ సైబర్‌క్రైమ్‌ కౌంటర్లు : డిజిపి


ప్రజాశక్తి- కడప ప్రతినిధి : రాష్ట్రంలో 26 వేల మంది మహిళల మిస్సింగ్‌ అవాస్తమని డిజిపి రాజేంధ్రనాథరెడ్డి తెలిపారు. 2019 నుంచి 2021 వరకు చోటుచేసుకున్న మిస్సింగ్‌ కేసులతో పాటు తాజా కేసులను ఎన్‌సిఆర్‌బి నివేదికలో కలపడంతో పెరుగుదల కనిపిస్తోందని వివరించారు. కేసుల గణాంకాల ఆధారంగా విమర్శలు చేస్తే బాగుంటుందన్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా ఎస్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్లు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించామని చెప్పారు. మహిళా పోలీస్‌ వ్యవస్థను బలోపేతం చేశామన్నారు. లోక్‌ అదాలత్‌ల్లో 1.07 లక్షల కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్‌ మూలాలపై దృష్టి పెట్టామనీ, ఒరిస్సా నుంచి స్మగ్లింగ్‌ రవాణా నిరోధానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సైబర్‌క్రైమ్‌ నివారణకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చోరీలు, మహిళల వేధింపులు, హత్యలు, హత్యాయత్నం కేసులు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు శాతం మేరకు తగ్గాయన్నాఉ. ఎస్‌ఐ, సిఐ ప్రమోషన్లు చేపడతామని తెలిపారు. కానిస్టేబుల్‌ పోస్టుల నియమకం కోర్టు పరిధిలో ఉండడంతో చేపట్టలేకపోతున్నామని వివరించారు. కడప జిల్లాలో 2.1 శాతం నుంచి 1.7 శాతానికి, అన్నమయ్య జిల్లాలో 15 శాతానికి క్రైమ్‌ రేటు తగ్గిందని చెప్పారు. విలేకరుల సమావేశంలో కడప, అన్నమయ్య జిల్లాల ఎస్‌పి అన్బురాజన్‌, గంగాధర్‌రావు పాల్గొన్నారు.