Sep 08,2023 21:32

న్యూఢిల్లీ : సాధారణ ప్రజల ఆదాయాలను అధిక ధరలు దెబ్బతీయడంతో అదనపు ఖర్చులను అధిగమించడానికి మళ్లీ మైక్రోఫైనాన్స్‌ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. అనివార్యంగా అధిక వడ్డీ రేట్లు అయినా భరించడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2022 జూన్‌ నుంచి ఈ ఏడాది 2023 కాలంలో మైక్రోఫైనాన్స్‌ రుణాల జారీ 19.5 శాతం పెరుగుదలతో రూ.3.5 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇంతక్రితం ఏడాది ఇదే 11 మాసాల కాలంలో రూ.2.93 లక్షల కోట్ల రుణాలు జారీ అయ్యాయయని మైక్రోఫైనాన్స్‌ ఫర్‌ ఇండిసీ అసోసియేషన్‌ (ఎంఎఫ్‌ఐఎన్‌) ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. మైక్రో రుణాల జారీలో దేశంలో 85 ఎన్‌బిఎఫ్‌సి-ఎంఎఫ్‌ఐలు రూ.1,42,245 కోట్లతో 40.6 శాతం వాటాను కలిగి ఉన్నాయి. మరోవైపు 13 బ్యాంక్‌లు రూ.1,13,806 కోట్లతో 32.5 శాతం, చిన్న ఫైనాన్స్‌ బ్యాంక్‌లు రూ.60,293 కోట్లతో 17.2 శాతం వాటాను కలిగి ఉన్నాయి. గడిచిన ఏప్రిల్‌-మే కాలంలో రూ.43,501 కోట్ల మైక్రో రుణాలు జారీ అయ్యాయి.