Jan 10,2023 14:35

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్యజిల్లా) : క్రీడలతో ఆరోగ్యముతో పాటు మానసిక వికాసం కూడా లభిస్తుందని లయన్స్‌ క్లబ్‌ చైర్మన్‌, సరస్వతి విద్యా మందిరం పాఠశాల ఉపాధ్యక్షులు పోతు గుంట రమేష్‌ నాయుడు పేర్కొన్నారు. హిందూపురంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన కబడ్డీ, క్యారం బోర్డు, షటిల్‌, పరుగు పందెం, హై జంప్‌, డిస్క్‌ త్రో, షాట్‌ పుట్‌ వంటి వివిధ రకాల క్రీడా పోటీలలో సరస్వతీ విద్యా మందిరం నుంచి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం సరస్వతీ విద్యా మందిరంలో విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న పోతుగుంట రమేష్‌ నాయుడు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా ఎంతో ఆవశ్యకమని తెలిపారు. క్రీడల వలన శారీరక, మానసిక రుగ్మతలు తొలగి ఆరోగ్యవంతంగా ఉంటారని అన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గౌరీ, పాఠశాల కమ్యూనిటీ సభ్యులు తుంగ రమణారెడ్డి, తుమ్మలూరు చంద్రశేఖర్‌ రెడ్డి, నాసంశెట్టి వెంకటసుబ్బయ్య, ఉపాధ్యాయులు రేఖారాణి, దయాకర్‌, కష్ణమూర్తి, పుష్ప, కళ్యాణి, జయలక్ష్మిలు విద్యార్థులకు పతకాలు, జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలియజేశారు.