Jul 28,2023 10:35

షిల్లాంగ్‌ : పశ్చిమ గారో హిల్స్‌ జిల్లాలోని తురా పట్టణంలో మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా కార్యాలయంపై సోమవారం రాత్రి జరిగిన దాడిలో ప్రమేయం ఉన్న 20 మందిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు ఉన్నారు. వారిని బెలీనా ఎం మరక్‌, దిల్చే చ్‌ మరక్‌ లుగా గుర్తించారు. ఈ విషయాన్ని అక్కడి పోలీసు అధికారులు తెలిపారు. తురాలోని మినీ సెక్రెటేరియట్‌పై ఒక గుంపు రాళ్లు రువ్వి, పోలీసు వాహనానికి నిప్పుపెట్టింది. రెండు ఫైర్‌ టెండర్లను ధ్వంసం చేసింది. ఆ తర్వాత జరిగిన దాడిలో ఐదుగురు పోలీసు అధికారులు గాయపడ్డారు. దాడి జరిగిన సమయంలో తురాను రాష్ట్ర శీతాకాల రాజధానిగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ నిరాహారదీక్ష చేస్తున్న గారో కమ్యూనిటీకి చెందిన పౌర సమాజ సంఘాలతో సంగ్మా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం, రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌ తూర్పు ఖాసీ హిల్స్‌ జిల్లాలో ఉంది. కాగా, ఆందోళనకారుల దాడిలో కనీసం 21 వాహనాలు ధ్వంసమయ్యాయని సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. గుంపును ప్రేరేపించిన ఇద్దరు తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) నేతల కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారని సదరు అధికారి చెప్పారు. గాయపడిన పోలీసులకు సీఎం రూ.50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.