ఢిల్లీ: దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా దాదాపు 9,925 కార్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. వేగనార్, సెలెరియో, ఇగ్నిస్‌కు చెందిన మోడళ్లలో కొన్ని కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు పేర్కొంది. వెనక బ్రేక్ అసెంబ్లీ పిన్‌లో లోపం ఉండే అవకాశం ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 2022 ఆగస్టు 3 నుంచి సెప్టెంబరు 1 మధ్య తయారైన కార్లలో లోపం ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఆ పిన్ విరిగిపోయి శబ్దం రావొచ్చని గుర్తించినట్లు పేర్కొంది. దీర్ఘకాలంలో అది బ్రేక్ పనితీరుపై ప్రభావం చూపొచ్చని వివరించింది. ఈ నేపథ్యంలోనే వినియోగదారుల భద్రతను దఅష్టిలో ఉంచుకొని కార్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. పూర్తిగా తనిఖీ నిర్వహించి.. లోపం ఉన్నట్లు గుర్తిస్తే సరిచేస్తామని పేర్కొంది. వినియోగదారులు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇప్పటికే అందుకు కావాల్సిన పరికరాలను వర్క్‌షాప్‌లకు పంపామని చెప్పింది. పైన తెలిపిన తేదీల్లో తయారైన కార్లను కొనుగోలు చేసిన వినియోగదారులను కంపెనీ ప్రతినిధులు త్వరలోనే సంప్రదిస్తారని తెలిపింది.










