- పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : బడుగు, బలహీనవర్గాల పట్ల వైసిపి ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న విషయం మరోసారి రుజువైందని పిసిసి రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు విమర్శించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న రెండో విడత ఎంబిబిఎస్ కౌన్సెలింగ్ మొత్తం అవకతవకలుగా జరిగిందన్నారు. దీనిపై 21న జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇదే విషయంపై సిఎంకు బహిరంగ లేఖ రాయనున్నట్లు గిడుగు పేర్కొన్నారు. ఈ నెల 22న వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్‌ను, రిజిస్ట్రార్‌ను కలిసి తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా ఇవ్వడంతోపాటు న్యాయ పోరాటం కూడా చేస్తామన్నారు. ప్రతిభగల విద్యార్థులకు ఓపెన్ కేటగిరి కింద సీట్లు కేటాయించకుండా రిజర్వుడ్ సీట్లు కేటాయిస్తూ బలహీనవర్గాలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. 53 వేల ర్యాంకు విద్యార్థికి రిజర్వు సీటు, 60 వేల ర్యాంకరుకు ఓపెన్ కేటగిరిలో సీటు ఇచ్చారన్నారు. మహిళా బిల్లులోనూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు రాజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సమావేశంలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, నగర అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు, ఎఐసిసి సభ్యులు కొలనుకొండ శివాజి తదితరులు పాల్గొన్నారు.










