- జగనన్న కాలనీల్లో ఇంకుడు గుంతలు
- రూ.3,600 కోట్ల డ్రైనేజీ వ్యవస్థ బదులు రూ.65 కోట్లతో సరిపెట్టే యోచన
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : జగనన్న ఇళ్ల పేరుతో ప్రభుత్వం మంజూరు చేసిన కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ, కాలువల నిర్మాణానికి ప్రభుత్వం మంగళం పాడుతోంది. రూ.3,600 కోట్లు ఖర్చయ్యే ఆ ప్రాజెక్టును చేపట్టలేమనే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం వాటిస్థానంలో తక్కువ ఖర్చుతో సోక్‌పిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అవయితే రూ.65 కోట్లతో పూర్తి చేయొచ్చని ప్రతిపాదనలు రూపొందించారు. దీనిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో జగనన్న నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద 30 లక్షల మందికి ప్లాట్లు ఇచ్చారు. వాటిల్లో 15 లక్షలు మొదటిదశలో టార్గెట్ కాగా, ప్రస్తుతం 3.42 లక్షల ఇళ్లు పూర్తి చేశారు. జగనన్న కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి రూ.3600 కోట్లు ఖర్చవుతుందని అధికారులు ప్రతిపాదించారు. దీనిలో కాలువలు, సీవరేజ్ ట్రీట్‌మెంటు ప్లాంట్లు, పైపులైన్లు తదితర అంచనాలు వేశారు. దీనిపై టెండర్లు పిలవాలని నిర్ణయించినా అంత మొత్తం వెచ్చించలేని పరిస్థితి ఏర్పడింది. నిధులు లేమి, టెండర్లు వేసినా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపించకపోవడం, బిల్లులు బకాయిలు ఉండటంతో పనులు ఇప్పట్లో చేయలేమనే నిర్ణయానికి అధికారులొచ్చారు. ప్రభుత్వం కూడా అంత ఖర్చు చేసేందుకు సుముఖంగా లేదు. దీంతో ప్రతి ఇంటికీ మ్యాజిక్ సోక్‌పిట్ల పేరుతో ఇంకుడు గుంతలు తవ్వించాలని నిర్ణయించారు. ఒక్కోదానికి రూ.6000 ఖర్చవుతుందని లెక్కవేయగా రూ.5000కు ఏర్పాటు చేసేందుకు ఓ కాంట్రాక్టరు ముందుకు వచ్చారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇళ్లలోనూ ఇంకుడు గుంతలు తవ్వాలని నిర్ణయించారు. డ్రైనేజీ వ్యవస్థ ఇప్పట్లో ఏర్పాటు చేయడం సాధ్యం కాదని తేల్చేశారు. కట్టిన ఇళ్లలో నలుగురు సభ్యులుంటారని, ఎంత వాడుకనీరు వస్తుంది, డ్రైనేజీ నీరు ఎంత వస్తుందనే అంచనాలూ వేశారు. దీని ప్రకారం ఇంకుడు గుంతలు తీయాలని నిర్ణయించారు.
60 లీటర్లు ఇంకిపోయేలా...
ప్రస్తుతం నలుగురు సభ్యుల కోసం నిర్మిస్తున్న ఇళ్లుకావడంతో ప్రతి ఇంట్లోనూ 220 లీటర్ల నీరు వినియోగం అవుతుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో నీటి వాడకం తక్కువ. దీనిలో 110 లీటర్లు ఏదో ఒక రూపంలో వినియోగం అవుతుంది. అందులో 50 లీటర్లు టాయిలెట్లకు అవి కమోడ్ ద్వారా భూమిలోకి వెళ్లిపోతాయి. మిగిలిన 60 లీటర్లు మాత్రమే బయటకు వెళుతుంది. ఈ నీరు ఇంకిపోయేలా సోక్‌పిట్లు నిర్మించాలనేది ప్రభుత్వ నిర్ణయం.
ఎక్కడ తవ్వాలో...
ఎక్కువగా ఇళ్లస్థలాలు ఇచ్చిన చోట్ల ఎక్కువ మంది సెంటు స్థలం కేటాయించారు. అప్పట్లో ఇళ్లు నిర్మించుకోవాలి. లేకపోతే రద్దుచేస్తారనే ప్రచారంతో ఎక్కువమంది సెంటు స్థలం మొత్తానికి పునాది వేసి దానిలోనే పూర్తిగా నిర్మాణం చేపట్టారు. అప్పట్లో డ్రైనేజీ వ్యవస్థతో కలిపి ఇంటి ప్లాను రూపొందిం చారు. ఇప్పుడు ఇంకుడు గుంతలు ఎక్కడ ఏర్పాటు చేయాలనేది సమస్యగా మారింది. రోడ్డుపై వేస్తే ప్లాను ప్రకారం సాధ్యం కాదు. గుంతలన్నీ రోడ్లపక్కన ఇంటి ముందు తవ్వితే మురుగునీరు గుంతలోకి పోకుండా రోడ్లపైకి వస్తే మరలా మురికివాడల మాదిరి తయారవుతాయనే సంశయం కూడా అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మ్యాజిక్ సోక్‌పిట్లు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని, వెంటనే వాటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిపై ఇటీవల జరిగిన గృహ నిర్మాణశాఖ సమీక్షా సమావేశంలో అధి కారులు ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రెజెంటే షన్ ఇచ్చారు. మ్యాజిక్ సోక్‌పిట్ ఏర్పాటు చేస్తామని వివరించారు. ఖర్చు తగ్గనున్న నేపథ్యంలో వెంటనే పనులు ప్రారంభించాలని సిఎం కూడా సూచించారు. అందుకోసం ఒక ఏజెన్సీని కూడా నియమించారు.










