మధుమేహం, డయాబెటిస్, షుగర్, చక్కెరవ్యాధి.. ఇలా రోజూ వింటూనే ఉన్నాం కదా! అయితే అది ఇప్పుడు మొదలైంది కాదు. వైద్య చరిత్రలో 'ది డయాబెటిస్ కోడ్' అనే పుస్తకం కొన్ని వేల ఏళ్ళ క్రితమే ఉందని కొంతమంది నిపుణులంటున్నారు. ఎబెర్స్ పాపిరస్ అనే ఈజిప్టు వైద్య గ్రంథంలో, ప్రాచీన హిందూ గ్రంథాల్లోనూ ఈ మధుమేహాన్ని ప్రస్తావించారట. మెంఫిస్‌కు చెందిన గ్రీసు వైద్యుడు అపోలోనియస్ క్రీ.పూ. 250లో డయాబెటిస్ అనే పేరుపెట్టారు. అధికంగా మూత్రవిసర్జన జరగడమే దీనర్థం. మధుమేహానికి ఇన్సులిన్ లోపమే కారణమని 1910లో సర్ ఎడ్వర్డ్ షార్పీ స్కేఫర్ కనిపెట్టారు. అసలెందుకు వస్తుంది..? ఎవరికి వస్తుంది..? నివారణేంటి..? తీసుకోవలసిన జాగ్రత్తలేంటి? తదితర విషయాలను తెలుసుకుందాం.
అధిక దాహం, అధిక మూత్ర విసర్జన, విపరీతమైన అలసట, క్రమంగా బరువు కోల్పోవడం, గాయాలు మానకపోవడం డయాబెటిస్ లక్షణాలు. అంధత్వం, మూత్ర పిండాలు పని చేయకపోవడం, గుండెపోటు, పాదాలకు ఇన్ఫెక్షన్ సోకడం వంటి అనేక అనారోగ్య సమస్యలు డయాబెటిస్ వల్ల వచ్చేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
- నిర్ధారణ..
గ్లూకోజ్ స్థాయిలు పొద్దున ఏమీ తినక ముందు 70 - 100 స్థాయిలో ఉంటే సాధారణం. 100 - 125 మి.గ్రా.లకు చేరితే ప్రీ డయాబెటిస్, 126 ఆపైన ఉంటే మధుమేహం ఉన్నట్లు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
- కారణాలు..
నేటి జీవనశైలిలో వచ్చిన మార్పులు, అధిక పని గంటలు, ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం, అధిక క్యాలరీల ఆహారం, మద్యపానం, పొగ తాగడం వంటివన్నీ డయాబెటిస్‌కు ప్రధాన కారణాలని డయాబెటిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షు లు డాక్టర్ అనూప్ మిశ్రా వ్యక్తం చేశారు.
- రివర్సల్ వీలవుతుందా..
'అవుతుంది.. డయాబెటిస్ కొన్నిసార్లు స్టెరాయిడ్లు వాడటం, కోవిడ్, గర్భిణీలలో వచ్చే అవకాశమూ ఉంది. అలాంటప్పుడు నియమానుసారం డైట్ పాటించాలి. కచ్చితంగా వ్యాయామం చేసి, నియంత్రణ లోకి తెచ్చుకోవచ్చు' అని అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ మేనేజింగ్ డైరెక్టర్, ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ ఆలపాటి లక్ష్మి లావణ్య అంటున్నారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్థులందరికీ ఒకే ఔషధం, ఒకే డైట్ ప్లాన్ పనిచేయవు. వారి ఆరోగ్య పరిస్థితులు, శారీరక నిర్మాణం దృష్ట్యా డాక్టర్ సూచనలు పాటించి, ఫలితం పొందవచ్చు అంటారామె.
- అసాధ్యమే..
'కానీ, శరీరంలో బీటాకణాలు దెబ్బతిని, వాటి పనితీరు మందగిస్తే మధుమేహ నియంత్రణ జరగదు' అని అన్నారు. అలాగే, ఇన్సులిన్ లోపం పూర్తిగా ఏర్పడినవారిలో మాత్రం డయాబెటిస్ రివర్సల్ సాధ్యమయ్యే పనికాదని ఆమె అంటున్నారు.
నియంత్రణ సాధ్యమా..
ఉపవాసం, మితాహారం, పోషకాహారం ద్వారా డయాబిటిస్‌ను నియంత్రించవచ్చునని డయాబెటిస్ ఎడ్యుకేటర్, న్యూట్రిషనిస్ట్ డా. శుభశ్రీ రే అంటారు. వారానికి రెండుసార్లు ఉపవాసం చేయడం కూడా వైద్యంలో భాగమేనని డా. శుభశ్రీ, డా. జ్యాసన్‌ఫాంగ్ అంటారు. దీని ద్వారా కార్బోహైడ్రేట్లు, చక్కెర స్థాయిలు తగ్గి, ఇన్సులిన్ స్థాయిలు క్రమ పద్ధతిలో ఉంటాయని తెలిపారు.
- ఆహారమే ఔషధం..
ఆహారంలో చిరుధాన్యాలు, కార్బోహైడ్రేట్లు లేని ఆరెంజ్, పుచ్చకాయ, పీచ్, జామ వంటి పళ్ళు, ప్రొటీన్ ఉండే బీన్స్, పప్పు ధాన్యాలు, చిక్కుడు గింజలు, కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలు తీసుకోవచ్చని చెప్పారు. ఆకుకూరలు, చిరుధాన్యాలు, ఓట్స్, దంపుడు బియ్యం, బాదాం, వాల్‌నట్స్, పిస్తా, జీడిపప్పు ఆరోగ్యానికి మంచిదని వివరిం చారు. ఆలివ్‌నూనె, నెయ్యి, కొబ్బరినూనె, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వుతో కూడిన ఆహారం డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతాయని అంటున్నారు నిపుణులు.
'కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్, కేక్స్, స్వీట్లు, సోడా, బిస్కెట్లు, వేపుడు, ఫాస్ట్‌ఫుడ్స్ నివారించాలి. ఒకవేళ నియంత్రణలోనే ఉంది కదా అని జీవనశైలి యథా విధిగా ఉంటే డయాబెటిస్ స్థాయిలు మళ్ళీ పెరుగుతాయి' అని ప్రజ్ఞానంద్ అంటున్నారు.
- మళ్ళీ మామూలుగా ఉండొచ్చా..!
'ఒకసారి సాధారణంగా ఉందని పరీక్షలు చేయించుకోవడం ఆపకూడదు. వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయించుకుంటూ స్థాయిల్ని బట్టి మందులు వాడాలి.. ఆహారనియమాలు పాటించాలి. వైద్యులు మందులతో పాటు జీవనశైలిలో మార్పుల్నీ సూచించాలి. ముందు తక్కువ మోతాదులో మెడిసిన్ ఇస్తూ, చికిత్స మొదలుపెట్టాలి. ఎప్పటికప్పుడు మధుమేహ స్థాయిలు చెక్ చేసుకునేలా చూడాలి. అవసరా నికి అనుగుణంగా మందుల డోస్ మారుస్తూ వైద్యం చేయాలి!' అని డా.లక్ష్మి అంటున్నారు.
- డేటా..
ప్రపంచవ్యాప్తంగా 1980లో 10.8 కోట్ల మంది డయాబెటిస్ రోగులు ఉండగా, 2014 నాటికి వారి సంఖ్య 422 మిలియన్ (40.22 కోట్లు) కు చేరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. 2019లో 10.5లక్షల మంది నేరుగా మధుమేహం వల్లే చనిపోయారని ఆ సంస్థ చెబుతోంది. మనదేశంలో 7.7 కోట్ల మంది వయోజనులు డయాబెటిస్ ఉందని అంచనా. ఈ సంఖ్య 2045 నాటికి 13.4 కోట్లకు చేరవచ్చు. మనదేశంలో 25ఏళ్ల లోపు ఉన్న ప్రతి నలుగురిలో ఒకరికి అడల్ట్ ఆన్‌సెట్ టైప్-2 డయాబెటిస్ ఉన్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ యూత్ డయాబెటిస్ రిజిస్ట్రీ చెబుతోంది.