Aug 29,2022 09:28
  • శ్రీకాకుళం జిల్లాలో 3,111 మందికి సిసిఆర్‌సి కార్డులు
  • వారిలో 241 మందికే రుణాలందించిన బ్యాంకర్లు
  • వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సిన దుస్థితి

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : ఆమదాలవలస మండలం పొన్నాంపేట గ్రామానికి చెందిన ఇప్పిలి సత్యనారాయణ 12 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి వేశారు. కౌలు గుర్తింపు కార్డు కోసం ఈ ఏడాది మేలో దరఖాస్తు చేసుకున్నారు. తహశీల్దార్‌, సచివాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. కార్డు రాకపోడంతో పంట ఖర్చుల కోసం ఇప్పటివరకు నూటికి రూ.1.50 వడ్డీ చొప్పున రూ.1.50 లక్షలు అప్పు చేశారు. ఖరీఫ్‌లో అమ్మిన ధాన్యానికి ప్రతి ఏడాదీ ఫిబ్రవరి తర్వాతే ప్రభుత్వం రైతులకు చెల్లిస్తుండటంతో ఆరు మాసాల తర్వాత బాకీ తీరుస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. కనీసం ఆరు మాసాలకు వడ్డీ లెక్కగడితే రూ.13,500 అవుతోంది. పెరిగిన పంట ఖర్చులకు తోడు వడ్డీ సొమ్ము అదనపు భారం కావడంతో గిట్టుబాటు కావడం లేదు. అయినా, వ్యవసాయాన్ని వదల్లేక చేస్తున్నానంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నందిగాం గ్రామానికి చెందిన హనుమంతు సుధాకర్‌ మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. కౌలు గుర్తింపు కార్డు వస్తే తక్కువ వడ్డీకే బ్యాంకు రుణం పొందొచ్చని కార్డు కోసం ప్రయత్నించారు. యజమాని, తహశీల్దార్‌ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోవడంతో వడ్డీ వ్యాపారి దగ్గర నెలకు రూ.2లు వడ్డీ చొప్పున రూ.60 వేలు అప్పు తీసుకున్నారు. నెలకు రూ.1200లు వడ్డీ అవుతోంది. ఖరీఫ్‌లో ధాన్యం అమ్మిన తర్వాత డబ్బులు తిరిగి చెల్లిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే బ్యాంకు రుణం దొరికితే ఏడు శాతం వడ్డీ చొప్పున నెలకు రూ.420లతోనే సరిపోయేది. పైగా సకాలంలో చెల్లిస్తే మూడు శాతం వడ్డీ రాయితీ (రూ.180) కూడా తిరిగి ఖాతాలో జమ అయ్యేదని అన్నారు. వీరిద్దరే కాదు... శ్రీకాకుళం జిల్లాలో వేలాది మంది కౌలు రైతుల పరిస్థితి ఇలానే ఉంది.

జిల్లాలో ఈ ఏడాది పంట సాగుదారు హక్కు కార్డుల (సిసిఆర్‌సి) జారీలో అటు ప్రభుత్వం, ఇటు అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు. ఏళ్ల తరబడి కౌలు చేస్తున్నా సంతకం చేసేందుకు యజమానులు అంగీకరించలేదు. యజమానులను ఒప్పించే బాధ్యతను ప్రభుత్వంగానీ, అధికారులుగానీ తీసుకోలేదు. దీంతో వేలాది మంది కౌలు గుర్తింపు కార్డులకు నోచుకోలేదు. జిల్లాలో 80 వేల మంది వరకు కౌలు రైతులు ఉన్నారు. ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది 6,500 మందికి గుర్తింపు కార్డులు అందించాలని లక్ష్యంగా నిర్దేశించింది. అధికారులు కేవలం 3,111 మందికే కార్డులు ఇచ్చారు. ఏదో రకంగా గుర్తింపు కార్డులు పొందినా బ్యాంకుల నుంచి రుణాలకు కౌలు రైతులు నోచుకోవడం లేదు. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో కౌలు రైతులకు రూ.68 కోట్లు ఇవ్వాలని జిల్లా బ్యాంకర్ల కో-ఆర్డినేషన్‌ కమిటీ నిర్ణయించింది. ఇప్పటివరకు కేవలం 241 మందికి రూ.2.11 కోట్లను మాత్రమే అందించింది. లక్ష్యంలో ఇది 3.1 శాతంగా మాత్రమే ఉంది
 

                                                                    బ్యాంకుల నుంచి తిరస్కరణ

కౌలు రైతులు ఏదో రకంగా కష్టపడి గుర్తింపు కార్డులు తెచ్చుకున్నా బ్యాంకర్లు దయతలచడం లేదు. భూమిపై ఇప్పటికే అప్పు ఉందని, ఒకే భూమిపై ఇద్దరికి రుణం ఇవ్వడం కుదరదంటూ తిప్పిపంపుతున్నారు. దీంతో చేసేది లేక రైతులు వడ్డీ వ్యాపారులపై ఆధారపడుతున్నారు.

 

Loan-not-received-by-the-tenant-farmer

                                                                   బ్యాంకు రుణంపై ఆశ వదులుకున్నాను

కౌలు గుర్తింపు కార్డుల కోసం అనేక సార్లు తహశీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరిగినా రాలేదు. బ్యాంకుల నుంచి అప్పు వస్తుందన్న ఆశ లేదు. వడ్డీ వ్యాపారుల వద్ద రూ.50 వేలు తీసుకుని పంట సాగుకు మదుపులు పెడుతున్నాను.
                                                                                        -ఎన్‌.జగన్నాథం, పెద్దలవునిపల్లి (శ్రీకాకుళం)

 

Loan-not-received-by-the-tenant-farmer

                                                                          నెల నెలా వడ్డీ కడుతున్నాను

నేను ఆరు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి వేశాను. గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కౌలు రైతు కార్డు కోసం తిరుగుతున్నాను. ఇప్పటివరకు కార్డు మంజూరు కాలేదు. అధికారులను ప్రాధేయపడితే తొందరలోనే మంజారు చేస్తామని చెబుతున్నారు. కార్డు ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. పంట సాగు పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారుల వద్ద నెలకు రూ.2 చొప్పున వడ్డీకి లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నాను. నెలవారీ వడ్డీ కడుతున్నాను.
                                          -వి.జయరాం లక్ష్ముడుపేట (శ్రీకాకుళం జిల్లా)