Sep 27,2023 09:37
  • ఆ అవసరం వచ్చింది
  • ఈ ఆరు నెలలూ ప్రజల మధ్యే వుండాలి
  • టికెట్‌ రాని వారికి ప్రత్యామ్నాయం చూపుతా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : 'ఇప్పటివరకు మనం చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు. ఇక నుండి మరో ఎత్తు. మనం గేర్‌ మార్చాలి. ఆ అవసరం వచ్చింది.' అని రాష్ట్ర ముఖ్యమంత్రి. వైసిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కోఆర్డినేటర్లు, పార్టీ రీజినల్‌ ఇన్‌ఛార్జులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న ఆరు నెలలు చాలా ముఖ్యం. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి.' అని అన్నారు. ' మనమంతా ఒక కుటుంబంలోని సభ్యులమేననేది విస్మరించవద్దు. కొంతమందికి టిక్కెట్‌ ఇవ్వలేకపోవచ్చు. టికెట్‌ ఇవ్వనంత మాత్రాన వాళ్లు నా వాళ్లు కాకుండాపోరు.
          టికెట్‌ రాని వారికి ప్రత్యామ్నాయంగా మరో అవకాశం చూపుతా' అని చెప్పారు. నాయకుల పనితీరుపై సర్వేలు కూడా తుది దశలోకి వస్తున్నాయని, చివరి దశ సర్వేలు కూడా జరుగుతాయన్నారు. ప్రజల్లో ఎక్కువగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయని, ప్రతి ఒక్కరూ ప్రజలతో మమేకమై పనిచేయాలన్నారు రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పార్టీశ్రేణులు ఉండాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్యసురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని ఆదేశించారు. ఒంటరిగా పోటీ చేయలేక ప్రతిపక్షాలు పొత్తులకు వెళ్తున్నాయని అన్నారు.అసెంబ్లీ నియోజకవర్గాల్లో విభేదాలు రాకుండా చూసుకోవాలన్నారు. వచ్చే నెలలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం, వై ఎపి నీడ్స్‌ జగన్‌ అనే కార్యక్రమం చేపడతామని అన్నారు.