Aug 18,2023 20:45

- టిడిపి టికెట్‌ ఇస్తే ఎమ్మెల్యేగా గెలుస్తా : యార్లగడ్డ
ప్రజాశక్తి-గన్నవరం (కృష్ణా జిల్లా) :టిడిపిలో చేరేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని కార్యకర్తల సాక్షిగా కోరుతున్నా, గన్నవరం టిడిపి టికెట్‌ ఇస్తే గెలిచి చూపిస్తా అని వైసిపి నేత యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. కఅష్ణా జిల్లా కానూరులోని యార్లగడ్డ కన్వెన్షన్‌ హాల్‌లో శుక్రవారం తన అనుచరులతో నిర్వహించిన ఆత్మీ సమావేశంలో రాజకీయ భవితవ్యంపై ఆయన మీడియాతో మాట్లాడారు. గన్నవరం అభ్యర్థిగా తాను పనికొస్తానని భావిస్తే టికెట్‌ ఇవ్వాలని కోరారు. జగన్‌మోహన్‌రెడ్డి తనకు తీరని అన్యాయం చేశారన్నారు. వైసిపిలో తనకు తగిన గుర్తింపు ఇవ్వకపోయినా ఏనాడు బాధపడలేదని, పార్టీ కోసం కష్టపడి పని చేసిన తన లాంటి వాడిని ఉండాలనుకుంటే ఉండు, లేకపోతే వెళ్లిపో అని సజ్జల వంటి నేత అనడం చాలా బాధగా ఉందన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన తనకు ఇలాంటి దుస్థితి వస్తుందని ఏనాడు ఊహించలేదని తెలిపారు. ఇప్పటి వరకు తాను చంద్రబాబునాయుడు, లోకేష్‌, దేవినేని ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్‌లను కలవలేదని స్పష్టం చేశారు. వారితో భేటీ అయ్యానని ఇంటిలిజెన్స్‌ రిపోర్టు ఉంటే తెప్పించుకుని పరిశీలించుకోవాలని తెలిపారు. బలాబలాలను బట్టి టికెట్‌ వస్తుందని వైసిపిలో కొందరు పెద్దలు మాట్లాడటం చేస్తే విచిత్రంగా ఉందన్నారు. 2018లో సరిపోయిన నా బలం ఇప్పుడు ఎందుకు బలహీనపడిందో పార్టీ పెద్దలే సమాధానం చెప్పాలన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి టికెట్‌ ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచి కానుకగా ఇస్తా, జగన్‌మెహన్‌రెడ్డిని కలుస్తా అని వ్యాఖ్యానించారు.