పలువురు టిడిపి నేతలకు కూడా...
ప్రజాశక్తి- గన్నవరం (కృష్ణా జిల్లా) :టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తోపాటు పలువురు టిడిపి నేతలకు బుధవారం కృష్ణా జిల్లా గన్నవరం జోన్ డిఎస్‌పి జయసూర్య ఆధ్వర్యంలో పోలీసులు నోటీసులు జారీ చేశారు. గన్నవరంలో జరిగిన యువగళం బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి రోజా, గుడివాడ, గన్నవరం ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీలపై లోకేష్‌తోపాటు టిడిపి కృష్ణా జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు, రాష్ట్ర నాయకులు అయ్యన్నపాత్రుడు, మరికొంతమంది టిడిపి నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఈ నోటీసులో పేర్కొన్నారు. 'ఈ నెల 22న బహిరంగ సభలో లోకేష్, అయ్యన్నపాత్రుడు, మరికొంతమంది నేతలు సిఎంపైనా, మంత్రి రోజాపైనా, ఎంఎల్‌ఎలపైనా అవమానకరమైన, పరువు నష్టం కలిగించే, అపహాస్యం చేసే ప్రకటనలు చేశారు. సిఎం పదవి ప్రతిష్టను కించపరిచారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యేలను డ్రాయర్‌తో నడిపించుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్తామని దుర్భాషలాడారు. ఎవరూ ఏ వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం మనోభావాలను ప్రభావితం చేసే లేదా ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించేలా నినాదాలు, ప్రకటనలు, ప్రదర్శనలు చేయకూడదు. సభలో మైక్‌లను అనుమతి ప్రకారం ఉపయోగించాలని పోలీసు అనుమతిలో పేర్కొన్నా దానికి భిన్నంగా ఎక్కువ సంఖ్యలో మైక్‌లు పెట్టారు. డిటిఎస్ మైక్ సిస్టం సౌండ్‌లతో అలజడి సృష్టించడం తప్పు కాదా? ఈ దృష్ట్యా మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలి' అని ఈ నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. దీనిపై స్థానిక టిడిపి నేతలు స్పందిస్తూ, తమ న్యాయవాదుల ద్వారా సమాధానం ఇస్తామని తెలిపారు. ప్రభుత్వం ఒక పథకం ప్రకారం టిడిపి నాయకులపై అక్రమ కేసులు పెడుతోందని, తమను ఇబ్బందులు పెట్టేందుకే ఈ విధంగా పోలీసులతో నోటీసులు జారీ చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి నేతలపై కొడాలి నాని, వల్లభనేని వంశీ వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు.










