బ్యాంకాక్: థాయ్ లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లోకి యువ షట్లర్ లక్ష్యసేన్ దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో లక్ష్యసేన్ 21-19, 21-11తో మలేషియాకు చెందిన జున్-యో-లియాంగ్‌పై వరుససెట్లలో గెలిచాడు. తొలి గేమ్‌లో ఇరువురు షట్లర్లు పోటాపోటీగా తలపడ్డారు. బ్యాంకాక్‌లోని హామార్క్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ పోటీలో తొలి గేమ్‌లో లక్ష్యసేన్ 10-16తో వెనుకబడ్డాడు. ఆ తర్వాత లక్ష్యసేన్ వరుసగా పాయింట్లు సాధించి ఆ గేమ్‌ను 21-19తో గెలుచుకున్న తీరు అద్భుతం. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో లక్ష్యసేన్ 9వ స్థానంలో ఉండగా.. జున్-హో-లియాంగ్ 65వ ర్యాంకర్. సెమీస్‌లో లక్ష్యసేన్ గ్వాంగ్-జు-లు(చైనా), విటిడ్‌శరణ్(థాయ్ లాండ్) మ్యాచ్ విజేతతో తలపడనున్నాడు. మరో క్వార్టర్‌ఫైనల్లో కిరణ్ జార్జి 16-21, 17-21తో ఫ్రాన్స్‌కు చెందిన జూనియర్ పొపొవ్ చేతిలో ఓడాడు. ఈ మ్యాచ్ కేవలం 41 నిమిషాల్లోనే ముగిసింది. కిరణ్ జార్జి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 59వ స్థానంలో ఉండగా.. జూనియర్ పొపొవ్ ర్యాంక్ 28. దీంతో ఈ టోర్నమెంట్‌లో మిగిలిన ఏకైక భారత షట్లర్ లక్ష్యసేన్ మాత్రమే.










