Jun 01,2023 22:04

బ్యాంకాక్‌: థాయ్ లాండ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లోకి యువ షట్లర్లు కిరణ్‌ జార్జి, లక్ష్యసేన్‌ ప్రవేశించారు. గురువారం జరిగిన రెండోరౌండ్‌ పోటీలో జార్జి 21-11, 21-19తో మలేషియా మాస్టర్స్‌ రన్నరప్‌ వెంగ్‌-హంగ్‌-యంగ్‌పై విజయం సాధించాడు. వరుససెట్లలో నెగ్గిన జార్జి క్వార్టర్‌ఫైనల్లో ఫ్రాన్స్‌కు చెందిన జూనియర్‌ పొపొవ్‌తో తలపడనున్నాడు. ఇక కామన్వెల్త్‌ క్రీడల స్వర్ణ పతక విజేత లక్ష్యసేన్‌ 21-17, 21-15తో లీ-షి-పెంగ్‌(చైనా)పై నెగ్గాడు. 4వ సీడ్‌గా బరిలోకి దిగిన లక్ష్యసేన్‌ ఈ మ్యాచ్‌ను కేవలం 49నిమిషాల్లోనే ముగించాడు. క్వార్టర్స్‌లో లాంగ్‌-జున్‌-హో(మలేషియా)తో పోటీపడనున్నాడు. ఇక పురుషుల డబుల్స్‌లో చిరాగ్‌శెట్టి-సాత్విక్‌ సాయిరాజ్‌ జోడీ 26-24, 11-21, 17-21తో ఇండోనేషియా జోడీ చేతిలో ఓడింది. ఇక మహిళల సింగిల్స్‌లో భారత్‌ పోరు ముగిసింది. సైనా నెహ్వాల్‌ 11-21, 14-21తో బింగ్‌-జియావో(చైనా)చేతిలో, అస్మిత చాహియా 8-21, 13-21తో కరోలినా మారిన్‌(స్పెయిన్‌) చేతిలో వరుససెట్లలో ఓటమిపాలయ్యారు.