న్యూఢిల్లీ : దేశంలోనే దిగ్గజ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి) కేంద్ర ప్రభుత్వానికి రూ.1831.09 కోట్ల డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ మొత్తానికి విలువ చేసే చెక్కును గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎల్‌ఐసి ఉన్నతాధికారులు అందించారు. మంత్రిని కలిసిన వారిలో ఎల్‌ఐసి మేనేజింగ్ డైరెక్టర్లు ఎం జగన్నాథ్, తబ్లేష్ పాండే, సత్‌పాల్ బానూ, ఆర్ దోరైస్వామీ, నార్తర్న్ జోన్ జిఎం జిపిఎస్ బజాజ్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి ఎంపి తంగారియా ఉన్నారు. కేంద్రానికి ఈ మొత్తం డివిడెండ్ అందించడానికి ఆగస్ట్ 22న ఎల్‌ఐసి వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారులు ఆమోదం తెలిపారని ఆ సంస్థ పేర్కొంది. 1956లో రూ.5 కోట్ల మూలధనంతో సంస్థ ప్రస్థానం మొదలయ్యిందని ఎల్‌ఐసి గుర్తు చేసింది. 2023 మార్చి ముగింపు నాటికి రూ.45,50,571.73 కోట్ల ఆస్తులకు చేరిందని పేర్కొంది. గడిచిన రెండు దశాబ్దాలుగా అనేక ప్రయివేటు రంగ బీమా సంస్థలు వచ్చినప్పటికీ.. ఇప్పటికీ ఎల్‌ఐసినే మార్కెట్ లీడర్‌గా ఉందని తెలిపింది.
ఎన్‌బిఎఫ్‌సిల్లో ఎల్‌ఐసి హౌజింగ్ ఫైనాన్స్ టాప్
న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తాజాగా బ్యాంకింగేతర విత్త సంస్థ (ఎన్‌బిఎఫ్‌సి)ల విభజనలో ఎల్‌ఐసి సబ్సీడరీ సంస్థ ఎల్‌ఐసి హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్‌ఐసిహెచ్‌ఎఫ్‌ఎల్) టాప్‌లో ఉంది. ఎగువ స్థాయి (అప్పర్ లేయర్) ఎన్‌బిఎఫ్‌సిలుగా 15 సంస్థలను ఆర్‌బిఐ గుర్తించింది. బడా ఎన్‌బిఎఫ్‌సిల జాబితాలో ఎల్‌ఐసి హౌజింగ్ ఫైనాన్స్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా సన్స్, ఎల్‌అండ్‌టి ఫైనాన్స్ కంపెనీలున్నాయి. ఎన్‌బిఎఫ్‌సిలకు సంబంధించి 2021 అక్టోబర్ నాలుగు కేటగిరీలుగా, వివిధ దశల నియంత్రణ విధానాన్ని ఆర్‌బిఐ ప్రవేశపెట్టింది. ఆర్థిక వ్యవస్థలో రిస్క్‌ను తగ్గించడానికి.. వీటిపై అధికంగా నిఘా ఉంచడానికి ఈ విధానాన్ని అవలంభిస్తుంది. ఈ క్రమంలోనే అగ్రశ్రేణీ, అప్పర్ లేయర్, మిడిల్ లేయర్, బేస్ లేయర్ అని ఎన్‌బిఎఫ్‌సిలను విభజించింది.










