Sep 14,2022 13:12

ప్రజాశక్తి-రాజోలు (అంబేద్కర్‌ కోనసీమ) : నెల రోజుల వ్యవధిలో మూడు సార్లు వరదలు లంక గ్రామాలను ముంచెత్తాయి. గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో కోనసీమ పరిధిలోని గోదావరి తీర లంక గ్రామాలు ముంపుతో అల్లాడుతున్నాయి. వరద ఉధృతి దృష్ట్యా అధికారులు నాటు పడవల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో లంక గ్రామాలకు వెళ్లేవారికి, లంక గ్రామాల నుంచి ఇవతలి తీరానికి వచ్చేవారికి ఇబ్బందులు పెరిగాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. దీంతో గోదావరి తీరంలోని లంక గ్రామాల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. లంకల్లో పంట పొలాలున్న వారు, పాడిపశువులున్నవారు వెళ్లటానికి మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారు. కోనసీమలో భాగమైన ఆచంట మండలం పరిధిలోని అయోధ్యలంక, పుచ్చల్లంక గ్రామాల వద్ద గంటగంటకూ గోదావరి మట్టం పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. నిత్యావసర వస్తువులు కావాలన్నా గోదావరి దాటి రావాల్సి ఉండటంతో ప్రజలు ఇబ్బందులపాలవుతున్నారు. గోదావరి దాటి రావాలంటే వీరికి నాటు పడవలే దిక్కు. గోదావరి వేగం పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తచర్యగా గోదావరిలో పడవలు తిరగకుండా రాకపోకలు నిషేధించటంతో లంక గ్రామాలకు బయటి ప్రపంచంతో రాకపోకలు నిలిచిపోయాయి.

ప్రమాదకరస్థితిలో పయనం :
అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ప్రాంతంలో పలు లంక గ్రామాలను వరదనీరు చుట్టుముట్టింది. గోదావరి మధ్యలో ఉన్న లంక గ్రామాల ప్రజలు బయటకు రావడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. రాజోలు నున్నవారి బాడవ, మెకనపాలెం ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. సఖినేటిపల్లి లంక కాజ్‌ వే, అప్పానిరాములంక కాజ్‌ వేలు పుర్తిగా నీట మునగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగతోంది. అత్యవసర పనులున్నవారు మోకాళ్ల లోతు నీళ్లలో నుంచి నడుచుకుంటూ ప్రమాదకర స్థితిలో కాజ్‌వే దాడుతున్నారు. వీటితోపాటు ఉభయ గోదావరి జిల్లాల సఖినేటిపల్లి- నరసాపురం రేవులోకి వరద నీరు పోటెత్తడంతో పంటు ప్రయాణం నిలిపివేశారు. దీంతో నరసాపురం ప్రయాణీకులు, ఉద్యోగులు తప్పనిసరి పరిస్థితుల్లో చించినాడ బ్రిడ్జ్‌ మీద నుండి ప్రయాణం సాగిస్తున్నారు. రాజోలు నియోజకవర్గ పరిధిలోని వరద ముంపు గ్రామాలను రాజోలు ఎంఎల్‌ఎ రాపాక వరప్రసాదరావు సందర్శించి ప్రజలకు అసౌకర్యాలు కలుగకుండా చూడాలని ఆధికారులను అప్రమత్తం చేశారు.