Apr 16,2023 09:21
  •  రేపటి వాయిదాపై ఉత్కంఠ
  •  సంచలనం రేపిన శ్రీనివాస్‌ ప్రకటన
  •  ఇప్పటి వరకు హాజరుకాని బాధితుడు
  •  సానుభూతి కోసం చేశానన్న నిందితుడు
  •  అధికార, ప్రతిపక్షం మధ్య మాటల తూటాలు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో కోడికత్తి కేసు సంచలనమైంది. వైసిపి అధికారంలోకి రావడం కోసమే కోడికత్తితో దాడి చేశానని నిందితుడు శ్రీనివాసరావు చెప్పినట్లు వచ్చిన వార్తలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ నెల 17కు ఎన్‌ఐఎ కోర్టు విచారణ వాయిదా వేసింది. అదేరోజు దీనిపై తుదితీర్పు వచ్చే అవకాశం ఉంది. ఇక ముందు విచారణ అవసరం లేదని ఎన్‌ఐఎ కూడా కోర్టుకు నివేదించింది. తనకు అడ్వకేట్‌ కమిషనర్‌ను వేసి తన అభిప్రాయం తీసుకోవాలని సిఎం మరో పిటిషన్‌ వేశారు. దీన్ని కొట్టివేయాలని, ఇక ముందు ప్రత్యేక విచారణ అవసరం లేదని ఎన్‌ఐఎ తరుపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే బాధితుడు కోర్టుకు వచ్చి పిటిషన్‌ వేయడంపై పూర్తి వివరణ ఇవ్వాలని కోర్టు బాధితుడిగా ఉన్న ప్రస్తుత సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని ఆదేశించింది. తాను రావడం వల్ల ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని, మినహాయింపు ఇవ్వాలని కోర్టును సిఎం కోరారు. విచారణ మొదలైన తరువాత ఇంతవరకు కోర్టుకు హాజరు కాకపోవడం సరైంది కాదని కోర్టు కూడా అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో 17న జరిగే విచారణలో కోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అప్పట్లో ఈ ఘటనపై రాజకీయ విమర్శలు రావడంతో కేసును ఎన్‌ఐఎకి అప్పగించారు. దీనిపై ఎన్‌ఐఎ కూడా రాజకీయ కోణం లేదని తేల్చినట్లు వార్తలు వచ్చాయి. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో నిందితుడు శ్రీనివాసరావు అప్పటి ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై 2018 అక్టోబరు 25న కోడికత్తితో దాడి చేశారు. తనపై హత్యాయత్నం జరిగిందని, తప్పుకోవడంతో చేతిపై గాయం అయిందని జగన్‌ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటన జరిగిన సమయంలో నిందితుడు టిడిపి అభిమాని అని ప్రచారం జరిగింది. వాస్తవంగా ఆయన వైసిపి కార్యకర్తేనని ముమ్మిడివరం సమీపంలోని ఆయన గ్రామ ప్రజలు కూడా తెలిపారు. ఈ కేసులో బాధితుడు, ఫిర్యాదుదారు అయినా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ కోర్టుకు హాజరుకాలేదు. తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో ఎన్‌ఐఎ కోర్టుకు సమర్పించిన విచారణ నివేదికలో పలు ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. నిందితుడు శ్రీనివాసరావు తాను జగన్‌కు సానుభూతి రావాలనే ఉద్దేశంతోనే స్టెరిలైజ్డ్‌ చేసిన కత్తితో చేతిపై గాయం చేశానని, పోలీసులు కూడా తనపై రాజకీయ కోణంలో విచారణ జరపలేదని ఎన్‌ఐఎకి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. విచారణ సమయంలో తనను పోలీసులు కొట్టారని, అయినా తాను చెప్పదలుచుకున్నదే చెప్పానని కోర్టుకు శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం దీనిపైనే రాజకీయ రచ్చ మొదలైంది. అధికార వైసిపిలో ఉన్న సీనియర్‌ మంత్రులు, ప్రతిపక్షం టిడిపి నాయకులు వాదులాటకు దిగారు. శనివారం రాష్ట్రంలో అన్నిచోట్లా ఇదే అంశంపై పరస్పర విమర్శలకు దిగారు. కావాలని కోడికత్తితో దాడి చేయించుకున్నట్లు గతంలో తాము చెబితే విమర్శించారని, ఇప్పుడు అదే నిజమైందని టిడిపి నాయకులు విమర్శించగా, అలిపిరి ఘటన చంద్రబాబు అడిగి చేయించుకున్నారా? అని మంత్రులు ప్రతి విమర్శకు దిగారు.