- కాన్వాయ్ ను అడ్డుకునేందుకు యత్నించిన రైతులు
ప్రజాశక్తి- ధర్మవరం టౌన్ (శ్రీ సత్యసాయి జిల్లా) : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి రైతుల నిరసన సెగ తగిలింది. నార్పలలో వసతి దీవెన కార్యక్రమం ముగిసిన అనంతరం హెలిప్యాడ్ మొరాయించడంతో ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన పుట్టపర్తికి బయలుదేరారు. ఈ సమయంలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని తుంపర్తి, మోటుమర్ల గ్రామాల రైతులు తమకు అదనపు పరిహారం అందజేయాలని డిమాండ్ చేస్తూ సిఎం కాన్వాయ్ ను పోతులనాగేపల్లి లేఅవుట్ వద్ద అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ సిఎం కాన్వాయ్ కు అడ్డుగా వెళ్లారు. సిఎం సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు వెంటనే అప్రమత్తమై రైతులను పక్కకు నెట్టేశారు. అనంతరం కాన్వారు ముందుకు వెళ్లిపోయింది. రైతులు ఆందోళన చేస్తున్నా ముఖ్యమంత్రి స్పందించకుండా వెళ్లిపోయారు.
- అదనపు పరిహారం ఇవ్వకుండా అన్యాయం చేశారు : బాధిత రైతులు
వైసిపి అధికారంలోకి వస్తే పరిహారం పెంచి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన నాయకులు అధికారంలోకి రాగానే దాని గురించి పట్టించుకోకుండా అన్యాయం చేశారంటూ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కాన్వారు వెళ్లిన తరువాత రైతులు వెంకట రాముడు, ఆంజనేయులు, లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు, తిమ్మక్క తిమ్మక్క తదితరులు మాట్లాడుతూ గతంలో టిడిపి హయాంలో అప్పటి ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఇళ ్లస్థలాల కోసం మోటుమర్ల, తుంపర్తి గ్రామ పొలాలను సేకరించారని తెలిపారు. ఏళ్ల తరబడి సాగులో ఉన్న భూములను తీసుకుని ఎకరాకు రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చారన్నారు. అప్పడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తాము అధికారంలోకి వచ్చాక పరిహారం ఎక్కువ ఇప్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా అదనంగా ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదన్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రికి విన్నవిద్దామనుకున్నామని, ముఖ్యమంత్రి సెక్యూరిటీ, పోలీసులు నిర్ధాక్షిణ్యంగా తమను పక్కకు తోసేశారని బాధిత మహిళా రైతులు తిమ్మక్క, గంగమ్మ కన్నీటి పర్యంతమయ్యారు.










