- సెప్టెంబర్ వచ్చినా మారని పరిస్థితి
- నాలుగున్నర లక్షల ఎకరాల లోటు
- పత్తి, మొక్కజొన్న బెటర్
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఆగస్టు ముగిసినా ఖరీఫ్ సాగు కలవరపాటు లోనే ఉంది. ఇప్పటికి కావాల్సిన సాగులో నాలుగు న్నర లక్షల ఎకరాలకు పైన (1.87 లక్షల హెక్టార్లు) తగ్గుదల కనిపిస్తోంది. మామూలు సాగులో ఆరు శాతం తక్కువ. ఆహారధాన్యాలు 1.08 లక్షల హెక్టార్లు తగ్గాయి. లోటు 7 శాతం. తిండిగింజల్లో ముఖ్యమైన వరి సాగు సైతం 46 వేల హెక్టార్లలో (4 శాతం) తగ్గింది. పప్పుధాన్యాలు 24 శాతం తగ్గాయి. ఖరీఫ్‌లో ఎక్కువగా సాగు చేసే కంది సాగు కూడా 20 శాతం లోటులో ఉంది. మినుములు, పెసలు, ఉలవలూ ఈపాటికి కావాల్సిన సాగులో తక్కువే సాగయ్యాయి. ఇక నూనెగింజలు 11 శాతం తగ్గాయి. ప్రధానమైన వేరుశనగ దాదాపు లక్ష హెక్టార్లలో (15 శాతం) తగ్గింది. చక్కెర ఫ్యాక్టరీల సంక్షోభం మూలంగా చెరకు సాగు బాగా తగ్గింది. ఇప్పటికి సాగు కావాల్సిన దాంట్లో సగానికంటే తక్కువ పడింది. దాదాపు అన్ని పంటలూ గతేడాది కంటే తగ్గాయి. ముతకధాన్యాల్లో మొక్కజొన్న, వాణిజ్యపంటల్లో పత్తి మాత్రం నార్మల్ కంటే స్వల్పంగా పెరిగింది.
పరిస్థితులు బాగున్నా...
ఈ మారు నైరుతి రుతుపవనాల ప్రభావం బానే ఉంది. మొత్తమ్మీద ఆశాజనకంగా వర్షాలు కురిశాయి. ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలుండటంతో కాస్త ముందే డెల్టా కాల్వలకు సాగు నీరు వదిలారు. అయినా సీజన్ ప్రారంభం నుంచీ సేద్యంలో జోరు కనిపించట్లేదు. సెప్టెంబర్ 2 సాయంత్రానికి రాష్ట్రంలో సగటున సాధారణ స్థాయి కంటే ఒక శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. శ్రీసత్యసాయి జిల్లాలో నార్మల్ కంటే అత్యధిక స్థాయి వర్షం పడింది. బాపట్ల, అనంతపురం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరులో ఎక్కువ స్థాయిలో, 19 జిల్లాల్లో సాధారణ స్థాయిలో వానలు కురిశాయి. విశాఖలో మాత్రం తక్కువ వర్షం నమోదైంది. ప్రస్తుతం ఎపిలో 109 మండలాల్లో వర్షాభావం ఉండగా, నంద్యాల జిల్లా చాగలమర్రిలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 74.8 శాతం తక్కువ వర్షం పడింది. కడపలో అత్యధికంగా 12 మండలాలు, ప్రకాశం, శ్రీకాకుళంలో 11 చొప్పున, తిరుపతిలో 10, నంద్యాల 8, విశాఖ జిల్లాలో 6 వర్షాభావ మండలాలున్నాయి.
విశాఖలోలో కనిష్టం
సీజన్‌లో మూడు మాసాలు గడిచి సెప్టెంబర్ వచ్చినా ఇంకా మూడు జిల్లాల్లో నార్మల్ సాగులో సగానికంటే తక్కువగా సేద్యం జరిగింది. కనిష్టంగా విశాఖలో 45 శాతం సాగు నమోదైంది. అన్నమయ్య, ప్రకాశంలో 47 శాతం వంతున సేద్యం జరిగింది. అత్యధికంగా శ్రీసత్యసాయి జిల్లాలో 96 శాతం సేద్యం జరిగింది. నెల్లూరు 93 శాతం, తూర్పుగోదావరి 92 శాతం, కాకినాడ 91 శాతం మేర సాగు నమోదైంది. వాతావరణ పరిస్థితులు, విత్తనాల్లో నాణ్యతాలోపాల వలన పత్తి, వేరుశనగ, వరి పంటలకు ఉధృతంగా తెగుళ్లు వ్యాపిస్తున్నాయి.











