Jun 08,2023 07:00
  • కేంద్ర మంత్రివర్గం నిర్ణయం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఖరీఫ్‌ పంటలకు కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)లను ప్రకటించింది. కనీస మద్దతు ధరలకు సంబంధించి స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసు చేసిన సి2 ప్లస్‌ 50 శాతం అమలు చేస్తామని తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీకి భిన్నంగా అరకొరగా ఎంఎస్‌పి ప్రకటించింది. వరికి ఎంఎస్‌పి క్వింటాలుకు రూ.143 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది, పెసర క్వింటాలుకు రూ.803 చొప్పున, రాగులు క్వింటాలుకు రూ.268 చొప్పున పెంచింది. కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పియూష్‌ గోయల్‌ మీడియాకు వివరించారు.
సాధారణ వరి క్వింటాలుకు కనీస మద్దతు ధర 2022-23లో రూ.2,040 ఉండేది. దీనిని 2023-24 కోసం రూ.2,183కు పెంచారు. అంటే రూ.143 పెరిగిందన్నమాట. గ్రేడ్‌ ఏ వరి క్వింటాలుకు ఎంఎస్‌పిని రూ.2,060 నుంచి రూ.143 పెంచి, రూ.2,203 చేశారు. పెసరకు ఎంఎస్‌పిని క్వింటాలుకు రూ.7,755 నుంచి రూ.8,558కి పెంచారు. హైబ్రిడ్‌ జొన్నలు క్వింటాలుకు ఎంఎస్‌పిని రూ.2,970 నుంచి రూ.210 పెంచి, రూ.3,180 చేశారు. రాగులు (చోళ్లు) క్వింటాలుకు రూ.3,578 నుంచి రూ.3,846కు పెంచారు. అంటే రూ.268 పెరిగింది. వేరుశనగలు (పల్లీలు) క్వింటాలుకు రూ.527 పెంచి, రూ.6,377 చేశారు. అంతకు ముందు ఏడాది రూ.5,850 ఉండేది. ప్రత్తికి రూ.6,080 నుంచి రూ.6,620కి పెంచారు. సన్‌ ఫ్లవర్‌ కి రూ.6,400 నుంచి రూ.6,760కి పెంచారు.
అలాగే కేంద్ర మంత్రివర్గం మరి కొన్ని కీలక నిర్ణయాలు కూడా చేసింది. అందులో ఒకటి ''బొగ్గు, లిగ్నైట్‌ అన్వేషణ పథకం''. ఈ స్కీమ్‌ను కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సిసిఐఎ) ఆమోదం తెలిపింది.

  • బిఎస్‌ఎన్‌ఎల్‌కు రూ. 89,047 కోట్ల ప్యాకెేజీ

బిఎస్‌ఎన్‌ఎల్‌కు మూడో పునరుద్ధరణ ప్యాకేజీకి రూ. 89,047 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో ఈక్విటి ఇన్ఫ్యూషన్‌ తో బిఎస్‌ఎన్‌ఎల్‌కు 4జి/5జి స్పెక్ట్రమ్‌ కేటాయింపు ఉంటుంది. బిఎస్‌ఎన్‌ఎల్‌ అదీకృత మూలధనం రూ.1,50,000 కోట్ల నుంచి రూ. 2,10,000 కోట్లకు పెరుగుతుంది.

  • తక్కువ ఎంఎస్‌పితో రైతులకు ద్రోహం : ఎఐకెఎస్‌

తక్కువ ఎంఎస్‌పి ప్రకటించి రైతులకు మోడీ ప్రభుత్వం ద్రోహం చేసిందని ఎఐకెఎస్‌ ఉపాధ్యక్షుడు హన్నన్‌ మొల్లా విమర్శించారు. వరికి క్వింటకు సి2ం50 ప్రకారం రూ.2707.5 ప్రకటించాలని, కాని ప్రభుత్వం ఎంఎస్‌పి రూ.2,183 ప్రకటించిందని, దీనివల్ల రైతులకు రూ. 524.5 నష్టమని తెలిపారు. వేరుశెనగకు సి2ం50 ప్రకారం రూ. 7,411.5 ప్రకటించాల్సి ఉందని, కాని ప్రభుత్వం రూ.6,377 ప్రకటించిందని తెలిపారు. దీనివల్ల క్వింటాల్‌కు రైతులు రూ.1,100.5 నష్టపోతున్నారని పేర్కొన్నారు. మొక్కజొన్నకి సి2ం50 ప్రకారం రూ. 2,569.5 ప్రకటించాల్సి ఉండగా, ప్రభుత్వం రూ. 2,090 ప్రకటించిందని, దీనివల్ల రైతులకు క్వింటాల్‌కు 479.5 నష్టం జరుగుతుందని అన్నారు. పత్తికి సి2ం50 ప్రకారం రూ. 8,095.5 ప్రకటించాల్సి ఉందని, కాని ప్రభుత్వం రూ.6,620 ప్రకటించిందని, దీనివల్ల క్వింటాల్‌కు రూ.1,475.5 నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. 2022-23 ధర నిర్ణయంలో నీటిపారుదల ఖర్చులు, ఎరువుల ధరలు తదితరాల పెరుగుదలను పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. ఒక సంవత్సరం తర్వాత సి2 ఖర్చులు దీని కంటే చాలా ఎక్కువ అని తెలిపారు.