న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బిజెపి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉడాన్ పథకం అనుకున్న లక్ష్యం నెరవేరలేదని ఖర్గే విమర్శించారు. ప్రాంతీయ విమానాశ్రయ అభివృద్ధి కార్యక్రమం పేరుతో కేంద్ర ప్రభుత్వం 2016 అక్టోబర్ 21వ తేదీన ఉడాన్ పథకాన్ని ప్రారంభించింది. సామాన్యులకు కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి తేవడమే ఈ పథకం యొక్క లక్ష్యంగా మోడీ ప్రభుత్వం చెప్పింది. ఈ పథకం పేరుతో ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరిచి నగరాలు, పట్టణవాసులకు విమాన ప్రయాణం సరసమైన ధరలకే అందుబాటులోకి తేనుందని ఆనాడు మోడీ ప్రభుత్వం గొప్పగా చెప్పింది. అయితే ఈ పథకాన్ని 2016లో ప్రారంభించినప్పటికీ.. ఇప్పటివరకు సామాన్యులకు విమాన ప్రయాణం అందుబాటులోకి తెచ్చేందుకు మోడీ ప్రభుత్వం ఏవిధమైన చర్యలు చేపట్టలేదని ఖర్గే ఆరోపించారు. ఈ పథకాన్ని గొప్పగా ప్రకటించినప్పటికీ.. దాదాపు 93 శాతం రూట్లు ప్రభుత్వం మెరుగుపరచలేదని స్వయానా కాగ్ రిపోర్ట్ వెల్లడించిందని ఖర్గే విమర్శించారు. మోడీ ప్రభుత్వం ప్రజలకు అబద్ధాలే చెబుతుందని కాగ్ రిపోర్ట్‌తో మరోసారి నిరూపితమైందని ఖర్గే చురకలంటించారు. ఈ సందర్భంగా 'చెప్పులు ధరించిన వారు కూడా విమానంలో ప్రయాణించడానికి వీలు కల్పిస్తామని ప్రధాని మోడీ చేసిన వాగ్ధానం అన్ని వాగ్ధానాల మాదిరిగానే నెరవేరలేదు' అని ఖర్గే ట్వీట్ చేశారు.










