May 31,2023 21:32
  • ఓస్టాపెంకో, గార్సియా ఔట్‌..

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ రెండోరౌండ్‌ పోటీల్లో సంచలనాలు నమోదయ్యాయి. 5వ సీడ్‌, ఫ్రాన్స్‌కు చెందిన గార్సియా, 17వ సీడ్‌ లాత్వియాకు చెందిన ఒస్టాపెంకో అనూహ్యంగా రెండోరౌండ్‌లో నిష్క్రమించగా.. రష్యాకు చెందిన 9వ సీడ్‌ కసట్క్సినా మూడోరౌండ్‌లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన రెండోరౌండ్‌ పోటీలో 9వ సీడ్‌, రష్యాకు చెందిన కసట్సినా 6-3, 6-4తో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన మార్కెటా వోండ్రుసోవాపై సంచలన విజయం సాధించింది. వోండ్రుస్కోవా మాజీ ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ రన్నరప్‌. తొలి సెట్‌లో కసట్సినా 2-3పాయింట్లతో వెనుకబడ్డా ఆ తర్వాత పుంజుకొని ఆ సెట్‌ను 6-3తో చేజిక్కించుకొంది. మూడోరౌండ్‌లో కసట్సినా 69వ ర్యాంకర్‌, అమెరికాకు చెందిన పైటన్‌ స్ట్రెన్స్‌తో తలపడనుంది. ఇక జెలెనా ఒస్టాపెంకో 3-6, 6-1, 2-6తో అమెరికాకు చెందిన అన్‌సీడెడ్‌ స్ట్రెరన్స్‌ చేతిలో, 5వ సీడ్‌ గార్సియా(ఫ్రాన్స్‌) 6-4, 3-6, 5-7తో బ్లింకోవా(రష్యా) చేతిలో ఓటమిపాలైంది. మరో పోటీలో 3వ సీడ్‌ పెగూలా(అమెరికా) 6-2, 6-0తో గ్లోర్గీ(ఇటలీ) పై సునాయాసంగా గెలిచింది. 2వ సీడ్‌ సబలెంకా, స్విటోలినా ప్రత్యర్థులపై గెలిచి మూడోరౌండ్‌లోకి ప్రవేశించారు.

2
  • సిట్సిపాస్‌, ఫోగ్నిని ముందుకు..

పురుషుల సింగిల్స్‌లో 5వ సీడ్‌ స్టెఫొనెస్‌ సిట్సిపాస్‌(గ్రీక్‌) మూడోరౌండ్‌కు చేరాడు. రెండోరౌండ్‌లో 6-3, 7-6(7-4), 6-2తో స్పెయిన్‌కు చెందిన అన్‌సీడెడ్‌ బీన్‌ను ఓడించాడు. మరో పోటీలో ఫోగ్నిని(ఇటలీ) 6-4, 7-6(7-5), 6-2తో కుబ్లెర్‌(ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు.
రెండోరౌండ్‌కు భారత డబుల్స్‌ జోడీ
ఇక పురుషుల డబుల్స్‌ తొలిరౌండ్‌లో భారత డబుల్స్‌ జోడీ యుకీ బాంబ్రీ-సాకెత్‌ మైనేని జోడీ 6-3, 6-2తో ఫ్రాన్స్‌ జోడీని ఓడించి రెండోరౌండ్‌లోకి దూసుకెళ్లగా.. ఎన్‌ఎస్‌ బాలాజీ-నెడుంఛేంజియన్‌ జోడీ 3-6, 4-6తో ఆస్ట్రేలియా జోడీ చేతిలో వరుససెట్లలో ఓటమిపాలైంది.