Sep 15,2023 14:33

సిరిసిల్ల: అటు అమ్మ కోరికను, ఇటు నాన్న కోరికను తీర్చలేకపోయానని చివరికి రాజకీయ నాయకుడినయ్యానని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణలో ఏటా 10వేల సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. '' నేను కూడా బైపీసీ విద్యార్థినే. మా నాన్న నన్ను ఐఏఎస్‌ చేయాలని అనుకునేవారు. మా అమ్మకు నన్ను డాక్టర్‌ చేయాలన్న కోరిక ఉండేది. ఎంసెట్‌లో 1600 ర్యాంక్‌ సాధించినా ఎంబీబీఎస్‌ సీటు రాలేదు. ఇప్పుడు అటు ఇటు కాకుండా రాజకీయ నాయకుడినయ్యాను. నేను 2009లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఎన్నికయినప్పుడు ఇక్కడ ఒక డిగ్రీ కాలేజీ ఏర్పాటు కొసం గొడవ జరిగింది. డిగ్రీ కాలేజీ సిరిసిల్ల ,వేములవాడలో పెట్టాలని గొడవ జరిగి అటుఇటు కాకుండా మధ్యలో పెట్టారు. అలాంటిది నేడు సిరిసిల్లకు జేఎన్‌టీయూ, మెడికల్‌ కాలేజీ, అగ్రికల్చర్‌ కాలేజీ వచ్చాయి. వైద్య వఅత్తి అత్యంత పవిత్రమైనది. పేదలకు సేవ చేసేందుకు మంచి శిక్షణ పొందండి. ఆపదలో వచ్చే వాళ్లు అటు దేవుణ్ణి ఇటు వైద్యులైన మిమ్మల్నే వేడుకుంటారు.'' అంటూ వైద్య విద్యార్థులకు కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.