ప్రజాశక్తి -నంద్యాల కలెక్టరేట్ / పాణ్యం :నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురంలో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు (ఐఆర్‌ఇపి, గ్రీన్‌కో) కింద భూములు కోల్పోయిన రైతులను న్యాయం చేయాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బాధిత రైతులను ఎపి రైతు సంఘం బృందం శనివారం కలిసింది. బాధిత రైతులు తమ సమస్యలను బృందం దృష్టికి తెచ్చింది. ఈ సందర్భంగా కె.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుల పక్షాన మేమున్నామని చెప్పుకునే ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి బాధిత రైతులకు ఇంతవరకు నష్టపరిహారం ఇప్పించకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఎకరాకు రూ.20 లక్షలు రావాలని, కానీ కేవలం రూ.తొమ్మిది -పది లక్షలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. పిన్నాపురం గ్రామ భూ భాదిత రైతులు ఐక్యంగా ఉండి పార్టీలకతీతంగా పోరాడి నష్టపరిహారం సాధించుకోవాలని కోరారు. అనంతరం నంద్యాల ఆర్‌డిఒను నాయకులు కలిశారు. పిన్నాపురం రైతుల జీవనోపాధి హక్కును హరించి వేస్తూ పాణ్యం తహశీల్దార్ ఇచ్చిన ఎ1 నోటీసును రద్దు చేయాలని నాయకులు కోరారు. రైతుల నుంచి అభ్యంతరాలకు అవకాశం లేకుండా మోసపూరితంగా రైతుల భూములను ఐఆర్‌ఇపి ప్రాజెక్టుకు కట్టబెట్టేందుకు తహశీల్దార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆర్‌డిఒకు వినతిపత్రం అందజేశారు. బృందంలో ఎపి రైతు సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు రమేష్‌కుమార్, సహాయ కార్యదర్శి రామచంద్రుడు, ఉపాధ్యక్షులు సద్దాం హుస్సేన్ తదితరులు ఉన్నారు.










