Apr 28,2023 08:55
  • చెన్నైపై మరోసారి గెలిచిన రాజస్తాన్‌

జైపూర్‌ : ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపి ఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మరోసారి రాజస్తాన్‌ రాయల్స్‌ ఝలక్‌ ఇచ్చింది. జైపూర్‌ వేదికగా జరిగిన ఐపిఎల్‌లో రాజస్తాన్‌ జట్టు 32పరుగుల తేడాతో చెన్నైపై గెలిచింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 202పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేయగా.. ఛేదనలో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 6వికెట్లు కోల్పోయి 170పరుగులే చేయగల్గింది. తొలుత రాజస్తాన్‌ ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌(77) తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ సీజన్‌లో జైస్వాల్‌ మూడో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. యశస్వీ 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధసెంచరీ చేశాడు. జోస్‌ బట్లర్‌(27) ధాటిగా ఇన్నింగ్స్‌ ఆరంభించారు. తుషార్‌ దేశ్‌పాండే ఒకే ఓవర్‌లో సంజూ శాంసన్‌(17), యశస్వీని ఔట్‌ చేసి రాజస్థాన్‌ను దెబ్బకొట్టాడు. చివర్లో దేవ్‌దత్‌ పడిక్కల్‌(27), ధ్రువ్‌ జురెల్‌(34) ధనాధన్‌ ఆడడంతో రాజస్థాన్‌ భారీస్కోర్‌ చేసింది. దేశ్‌పాండేకు రెండు, తీక్షణ, జడేజాకు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఛేదనలో చెన్నై ఓపెనర్‌ గైక్వాడ్‌(47), దూబే(52), మొయిన్‌ అలీ(23) జడేజా(23నాటౌట్‌) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. ఆడం జంపాకు మూడు, అశ్విన్‌కు రెండు, కుల్దీప్‌కు ఒక వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ జ్వైస్వాల్‌కు లభించింది.

012