- బాలకృష్ణ, లోకేష్‌తో కలిసి చంద్రబాబుతో పవన్ ములాఖత్
- ఉమ్మడి జెఎసి కమిటీ వేసి కార్యాచరణ ప్రకటిస్తాం
- ఎన్ని సీట్లలో పోటీ చేయాలనేది ఎవరో చెప్పాల్సిన పనిలేదు
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి :రానున్న ఎన్నికల్లో టిడిపితో కలిసే జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. 'స్కిల్' స్కామ్‌లో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడును బాలకృష్ణ, లోకేష్‌లతో కలిసి ఆయన గురువారం ములాఖత్ అయ్యారు. 40 నిమిషాల ములాఖత్ అనంతరం బాలకృష్ణ, లోకేష్‌లతో కలిసి ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. 'గత ఎన్నికల్లో విధానాల పరంగా భిన్నమైన ఆలోచనలు ఉండటంతో విడిగా పోటీ చేశాం. మా నాన్న అస్థికలు కాశీలో కలపడానికి వెళ్లినప్పుడు ముంబైలో బాంబు దాడి జరిగింది. తరువాత పార్లమెంట్‌పై దాడి జరిగింది. దేశానికి బలమైన నాయకుడు కావాలనే ఆకాంక్షతో మోడీకి మద్దతు తెలిపాను. నాటి నుంచి నేటి వరకూ మోడీ పిలిస్తేనే వెళ్లాను' అని అన్నారు. చంద్రబాబు రిమాండ్ ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపే అని అన్నారు. నేడు జరిగిన ములాఖత్ రాష్ట్రానికి చాలా అవసరం అని అన్నారు. ఇప్పటికీ తాము ఎన్‌డిఎలో ఉన్నామని, ఎన్‌డిఎ పెద్దలు మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు. వైసిపి అరాచకాలు, దోపిడీని అడ్డుకోవాలంటే విడిగా పోటీ చేస్తే సరిపోదన్నారు. టిడిపి, జనసేన కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసమేనన్నారు. జగన్ మద్దతుదారులకు ఇక ఆరు నెలలే సమయం ఉందని, వారు యుద్ధమే కావాలని కోరుకుంటే యుద్ధమే చేస్తామని హెచ్చరించారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో అరాచక పాలనను చూశామన్నారు. అందులో భాగంగానే మాజీ సిఎం చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా రిమాండ్‌కు పంపారని తెలిపారు. ఈ దుర్మార్గానికి నిరసనగానే చంద్రబాబుకు సంఘీభావం తెలిపామని చెప్పారు. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడే వ్యక్తి జగన్ అని విమర్శించారు. వలంటీర్లతో డేటా చోరీ చేస్తున్నాడంటే అది రాజ్యాంగ ఉల్లంఘనే అని స్పష్టం చేశారు. ఆయనపై ఇప్పటికీ ఈడీ కేసులు ఉన్నాయని, దేశం దాటి పోవాలంటే కోర్టు అనుమతి కావాలని ఎద్దేవా చేశారు. సిపిఎస్ రద్దు, మద్యపాన నిషేదం, ఉపాధి కల్పన వంటి హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. శాంతిభద్రతల గురించి ఎవరూ ప్రశ్నించకూడదా? రాష్ట్ర సరిహద్దుల్లోనే తనను ఆపేశారని, ఇంట్లో కూర్చోవాలని కండీషన్లు పెడుతున్నారని, తన పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అని అన్నారు. వివేకా హత్యలో నిందితులకు కొమ్ముగాయడం శోచనీయమన్నారు. వైసిపి నేతల హత్యలు, అరాచకాలు చేస్తున్నా కేసులు పెట్టడం లేదని తెలిపారు. గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో రూ.21వేల కోట్ల విలువైన మూడు వేల కేజీల హెరాయిన్ దొరికితే దాని మూలాలు విజయవాడలోని ఆషీ ట్రేడింగ్ కంపెనీలో ఉన్నాయని తేలిందన్నారు. ఆ కేసును సాక్షి మీడియా ఎందుకు బయటకు తీసుకురాలేదని ప్రశ్నించారు.
- నేటి నుంచే ఉమ్మడి కార్యాచరణ
జనసేన, టిడిపిలు గురువారం నుంచే ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతాయని తెలిపారు. ఉమ్మడి జెఎసి కమిటీ వేసి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. పోటీ చేసే అంశాన్ని కేంద్రానికి కూడా తెలియజేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఐక్యంగా ఏం చేయాలో ఆలోచిస్తాం, ఎలా పోటీ చేయాలో త్వరలో నిర్ణయిస్తామని తెలిపారు. ఎన్ని సీట్లలో పోటీ చేయాలనేది ఎవరో చెప్పాల్సిన పనిలేదన్నారు. ములాఖత్‌లో చంద్రబాబు ఆరోగ్యం గురించి అడిగానని, ఈ పరిస్థితి రావడం తనకు బాధగా ఉందని తెలిపానన్నారు. గతంలో చంద్రబాబు చాలా సమస్యలు ఎదుర్కొన్న వ్యక్తి అని, అందుకే ఆయనకు భద్రత కావాలన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.










