Jul 16,2022 09:49
  • 71 అడుగుల మేర ఉధృతంగా ప్రవాహం
  • తుంగభద్ర 30 గేట్లు ఎత్తివేత
  • శ్రీశైలానికి భారీగా వరద నీరు
  • ప్రకాశం బ్యారేజీకి 20వేల క్యూసెక్కులు

ప్రజాశక్తి - యంత్రాంగం : గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి ఉప్పెనలా వస్తున్న వరద ఉధృతికి భద్రాచలం పట్టణంతో పాటు దిగువన ఉన్న ఏజెన్సీ ప్రాంతం చిగురుటాకులా వణుకుతోంది. భద్రాచలం కరకట్ట దాటి వస్తున్న వరద ప్రవాహానికి శాంతినగర్‌, రాజుపేట, సిఆర్‌పిఎఫ్‌ క్యాంపు, రామాలయ పరిసరాలు, ముదిరాజ్‌ వీధి, ఇతర కాలనీలు నీట మునిగాయి. భద్రాచలానికి వచ్చే దారులన్నీ వరదలో చిక్కుకున్నాయి. హైదరాబాద్‌ రహదారిని పోలీసులు మూసివేశారు. భద్రాచలం పట్టణంలో సుమారు 1500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. గోదావరి పరివాహక ప్రాంతాలైన ఏటూరునాగారం, ములుగు, తాడ్వాయి, దుమ్ముగూడెం, చర్ల, పినపాక, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు మండలాలతో పాటు భద్రాద్రి దిగువన ఏజెన్సీలో వందలాది గ్రామాలను గోదావరి ముంచేసింది. వరదతాకిడికి సారపాకలోని ఐటిసి పరిశ్రమను మూసివేశారు. భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ కోల్‌ స్టోరీజీ పాయింట్‌లోకి వరద చొచ్చుకొచ్చింది. శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో భద్రాచలం వద్ద గోదావరి 71 అడుగుల మేర ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రతి నాలుగు గంటలకు ఒక అడుగుమేర నీటిమట్టం పెరుగుతుంది. భద్రాచలం నుంచి దిగువకు 25లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉందని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సిడబ్ల్యుసి) అధికారులు తెలిపారు. శనివారం మధ్యహ్నం వరకు వరద ఉధృతి కొనసాగుతుందని, రాత్రికి వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందనిఅధికారులు అంచనా వేస్తున్నారు.
      తుంగభద్ర డ్యాం నుంచి 30 గేట్ల ద్వారా 1,52,501 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిల్వ సామర్థ్యం 110 టిఎంసిలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 94.857 టిఎంసిలు నమోదైంది. జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా.. 1630.21గా నమోదైంది. దీంతో శ్రీశైల జలాశయ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి సుంకేసుల ద్వారా 1,35,453 క్యూసెక్కులు, జూరాల నుండి 1,34,933 క్యూసెక్కులతో కలిపి జలాశయానికి 2,70,386 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నాయి. దీంతో జలాశయం నీటిమట్టం 842.10 అడుగులకు చేరింది.
     నీటి నిల్వ 65.0461 టిఎంసిలుగా నమోదైంది. తెలంగాణ, తెలంగాణ పరిధిలో ఎడమ జల విద్యుత్‌ కేంద్రం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 31,784 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ప్రకాశం బ్యారేజీకి 20 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. 15గేట్లను ఒక్క అడుగు మేర ఎత్తి 15వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కాల్వలకు మరో ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.