Aug 14,2023 16:13

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌(అన్నమయ్యజిల్లా) : కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి రాహు కేతువుల్లా తయారయ్యారని పిసిసి మీడియా చైర్మన్‌ తులసి రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్‌ సమన్వయ కమిటీలు ఏర్పాటయ్యాక రాజంపేటలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో రాజంపేట కన్వీనర్‌ పూల భాస్కర్‌ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తులసిరెడ్డి మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ పాలనలో దేశం అప్పులు పాలయిందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి దేశాన్ని కార్పొరేట్లకు అమ్మివేస్తున్నాడని ఆరోపించారు. నిరుద్యోగం వికటాట్టహాసం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలే 12 లక్షలు ఖాళీలు ఉన్నాయని తెలిపారు. మణిపూర్‌ మండిపోతోందని ఆరోపించారు. దేశంలో దుశ్శాసన, సన కీచక పర్వాలు నడుస్తున్నాయని అన్నారు. బిజెపి ప్రభుత్వం రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలను నిలువునా మోసగించిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రజలను వంచన చేయడంలో మోడీనే మించిపోయారని ఆరోపించారు. నాలుగు సంవత్సరాల పాలనలో జగన్‌ రెడ్డి ఏడు లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్‌ గా మార్చారని అన్నారు. జగన్‌ రెడ్డి పాలనలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. రౌడీలు రాజ్యమేలుతున్నారని, ఇసుక, గంజాయి, మైనింగ్‌ తో పాటు మట్టిని కూడా వదలకుండా విచ్చలవిడిగా దోచుకుంటున్నారని ఆరోపించారు. పెట్రోల్‌ డీజిల్‌ ధరలు దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్‌ గా, ఋణాంధ్రప్రదేశ్‌ గా, అరాచక ఆంధ్ర ప్రదేశ్‌ గా తీర్చిదిద్దిన ఘనత వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హౌదా రావాలన్నా, విశాఖ స్టీల్‌, రైల్వే జోన్‌, కడప ఉక్కు వంటి పరిశ్రమలతో పాటు దేశం అభివద్ధి పథంలో నడవాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఆరు లక్షల వరకు వ్యవసాయ రుణమాఫీ, రూ 500 కే వంట గ్యాస్‌, నిరుపేద కుటుంబాలకు నెలకు రూ 6 వేలు ఆర్థిక సాయం, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ తో పాటు అధికారం చేపట్టాక ఏడాదిలోనే విభజన హామీలన్నీ పరిష్కరిస్తామని తెలియజేశారు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని పేర్కొన్నారు. త్వరలోనే మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్‌ పార్టీని ఆదరించి రానున్న ఎన్నికలలో రాహుల్‌ గాంధీని ప్రధానిగా గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చీకటి చార్లెస్‌, రాజంపేట సమన్వయ కమిటీ సభ్యులు చంద్రశేఖర్‌ రెడ్డి, కన్వీనర్‌ పూల భాస్కర్‌, సమన్వయ కమిటీ సభ్యులు ఎస్‌ ఎం డి గౌస్‌, జిల్లా కార్యదర్శులు ఓబులేసు, గంగాధర్‌, మైనారిటీ ఉపాధ్యక్షులు అబ్దుల్‌ అసూర్‌ తదితరులు పాల్గొన్నారు.