Jun 21,2023 15:10

విజయవాడ: వైసిపి ప్రభుత్వ తీరు వల్ల ఇప్పటికే అనేక పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తులసిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ తప్పులను మీడియాలో ఎత్తిచూపితే మార్గదర్శిని వేధించడం జగన్‌ ప్రభుత్వ అరాచకానికి నిదర్శనమన్నారు. వివిధ రాష్ట్రాల్లో మార్గదర్శి కార్యకలాపాలు నిర్వహిస్తోందని.. ఎక్కడా లేని విధంగా ఏపీలోనే సమస్య ఎందుకు వచ్చిందని తులసిరెడ్డి నిలదీశారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు.''మార్గదర్శిపై ఒక్క ఫిర్యాదు లేకపోయినా.. ప్రభుత్వానికి అత్యుత్సాహం ఎందుకు? ఆవు, దూడ బాగుంటే.. మధ్యలో గుంజకు వచ్చింది గురకరోగమని ఒక సామెత ఉంది. ఇచ్చేవాళ్లు, తీసుకునేవాళ్లకు లేని సమస్య ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది?. వైసిపి ప్రభుత్వ తీరు వల్ల ఇప్పటికే అనేక పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. నిరుద్యోగ యువతి, యువకులకు ఉద్యోగం కల్పించడం మానేసి.. ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థలను వేధిస్తూ జగన్‌ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారు. తానా అంటే తందాన అన్నట్లుగా సీఐడీ అధికారులు కూడా రాజకీయ నాయకుల మాదిరిగా మాట్లాడటం మంచిది కాదు'' అని తులసిరెడ్డి హితవు పలికారు.