Apr 06,2023 14:34

ప్రజాశక్తి - వేంపల్లె (కడప) : వైసిపి ప్రభుత్వం చేపట్టిన జగనన్నే మా భవిషత్తు అనే కార్యక్రమం హాస్యాస్పదమని పిసిసి మీడియా ఛైర్మన్‌ తులసిరెడ్డి అన్నారు. గురువారం వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జగనన్నే మా భవిష్యత్తు అనే దానికన్నా ''జగనే మా దరిద్రం - జగనే మా శని'' అని పేరు పెట్టడం సబబు అన్నారు. 46 నెలల జగన్‌ పాలనలో దంచుడే దంచుడు - బాదుడే బాదుడు కార్యక్రమం అమలు అయ్యిందని తెలిపారు. వైసిపి పాలనలో అన్ని వస్తువుల ధరలు, అన్ని ఛార్జీలు, పన్నులు పెరిగాయని అన్నారు. జగన్‌ పాలనలో అప్పులే అప్పులు అన్నారు. 4 సంవత్సరాల్లో రూ.7.5 లక్షల కోట్లు అప్పులు చేసినట్లు తెలిపారు. అరాచకంలో ఆఫ్ఘనిస్తాన్‌ను, అప్పుల్లో శ్రీలంకను వైసిపి ప్రభుత్వం దాటిపోయిందని చెప్పారు. జగన్‌ పాలనలో గన్‌ కల్చర్‌, గంజాయి కల్చర్‌ పెట్రేగి పోయినట్లు చెప్పారు. లాండ్‌, శాండ్‌, వైన్‌, మైన్స్‌, ఎర్రచందనం, బియ్యం మాఫియాలు చెలరేగి పోతున్నట్లు చెప్పారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ అయ్యిందని చెప్పారు. వరప్రసాదిని పోలవరం ప్రశ్నార్థక మారిందని విమర్శించారు. సంజీవిని లాంటి ప్రత్యేక హౌదా వూసే లేదని అన్నారు. నవరత్నాలు నకిలీ రత్నాలుగా మారిపోయినట్లు చెప్పారు. మాట తప్పడం జగన్‌ దిన చర్యగా మారిందని అన్నారు.