Jul 14,2023 10:54
  • నేడు పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌.. వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌

లండన్‌ : వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లోకి 6వ సీడ్‌ ట్యునీషియాకు చెందిన ఓన్స్‌ జబీర్‌ ప్రవేశించింది. గురువారం సెంటర్‌ కోర్టులో జరిగిన సెమీస్‌లో జబీర్‌ 6-7(5-7), 6-4, 6-3తో 2వ సీడ్‌ సబలెంకాపై సంచలన విజయం సాధించింది. తొలి సెట్‌ను టై బ్రేక్‌లో కోల్పోయిన జబీర్‌.. రెండో సెటన్‌ను పోరాడి చేజిక్కించుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లోనూ ఓ దశలో 5-1 ఆధిక్యతలో నిలిచి చివరకు ఆ సెట్‌ను 6-3తో గెలిచి ఊపిరి పీల్చుకుంది. గత ఏడాది వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌కు చేరి నయా చరిత్ర సృష్టించిన జబీర్‌.. శనివారం జరిగే ఫైనల్లో అన్‌సీడెడ్‌ వోండ్రోసోవాతో టైటిల్‌కై తలపడనుంది. టైటిల్‌ గెలిస్తే.. ట్యునీషియా తరఫున ఓ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన తొలి క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పనుంది.
 

వోండ్రోసోవా తొలిసారి..
2019 ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ రన్నరప్‌, చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన మార్కెటా వోండ్రోసోవా కెరీర్‌లో తొలిసారి వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ల్లో ఏనాడూ ఏనాడూ 2వ రౌండ్‌ను దాటని అన్‌సీడెడ్‌ క్రీడాకారిణి అయిన వోండ్రోసోవా గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి సెమీఫైనల్లో ఎలేనా స్వీటోలీనాను షాక్‌ ఇచ్చింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో వోండ్రోసోవా 42వ ర్యాంక్‌లో ఉండగా.. స్విటోలినాది 76వ ర్యాంక్‌. గురువారం జరిగిన తొలి సెమీస్‌లో వోండ్రోసోవా 6-3, 6-3తేడాతో స్విటోలినాపై వరుససెట్లలో గెలుపొందింది. ఫైనల్‌కు చేరే క్రమంలో వోండ్రోసోవా క్వార్టర్స్‌లో 4వ సీడ్‌ పెగులా(అమెరికా), ప్రి క్వార్టర్స్‌లో 32వ సీడ్‌, తన దేశానికే చెందిన బోజ్కోవా, అంతకుముందు 20వ సీడ్‌ వేకిక్‌(క్రొయేషియా) వంటి సీడెడ్‌ క్రీడాకారిణులను ఓడించి ఫైనల్‌కు చేరింది. వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో వోండ్రుసోవా ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి.
 

సెమీస్‌లో ఓడిన బొప్పన్న జోడీ..
వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో వెటరన్‌ రోహన్‌ బొప్పన్న పోరాటం ముగిసింది. సెమీస్‌కు చేరి ఆశలు రేపిన రోహన్‌ బొప్పన్న జోడీ గురువారం జరిగిన సెమీస్‌లో టాప్‌సీడ్‌ జోడీ చేతిలో ఓటమిపాలైంది. 6వ సీడ్‌ బరిలోకి దిగిన బొప్పన్న-ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జోడీ 5-7, 4-6తో టాప్‌సీడ్‌, కొల్హాప్‌ (ఫ్రాన్స్‌)-స్కుప్కీ (బ్రిటన్‌) జోడీ చేతిలో వరుససెట్లలో ఓడింది.
నేడు పురుషుల సింగిల్స్‌ సెమీస్‌..
అల్కరాజ్‌(1) × మెద్వదెవ్‌(3)
జకోవిచ్‌(2) × సిన్నర్‌(8)