- పోలీసుల దాష్టీకంపై క్రీడాలోకం కన్నెర్ర
న్యూఢిల్లీ : తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న మహిళా మల్లయోధులపై పోలీసుల దాష్టీకానికి సాక్ష్యంగా నిలిచిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. దేశానికి పతకాలు సాధించిన వినేశ్ ఫోగట్‌ను, రక్షణగా నిలిచిన ఆమె సోదరి సంగీతా పోగట్‌ను పోలీసులు బలవంతంగా బస్సులో ఎత్తి పడేసిన దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. టోక్యో ఒలింపిక్ పతక విజేత బజరంగ్ పునియా, రియో ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్‌ను కూడా పోలీసులు నిర్బంధించారు. ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు...ఇలా అనేక క్రీడా వేదికలపై దేశ పేరు ప్రఖ్యాతులను దశదిశలా ఇనుమడింపజేసిన మహిళా క్రీడాకారుల పట్ల పోలీసులు కనీసం గౌరవం చూపలేదు సరికదా తీవ్రమైన కాఠిన్యం ప్రదర్శించారు.
మహిళలు భరతమాత ముద్దుబిడ్డలంటూ పొగడ్తలతో ముంచెత్తే పాలకులు రెజ్లర్లపై చూపించే గౌరవం ఇదేనా అని క్రీడాకారులు నిలదీస్తున్నారు. 'ఇదంతా చూసి నేను చాలా విచారించాను. భారత క్రీడా రంగానికే ఇది చీకటి రోజు' అని టోక్యో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా వ్యాఖ్యానించారు. పోలీసులు ఇలా ప్రవర్తించి ఉండాల్సింది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. నిజమే...పరిస్థితిని చక్కదిద్దడానికి రెజ్లర్లు ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చారు. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్య తీసుకోవాలంటూ రెజ్లర్లు జనవరిలోనే గళం విప్పారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఒలింపిక్ పతక విజేతలు ఎంసీ మేరీకోమ్, యోగేశ్వర్ దత్‌తో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం అదే నెల 23న ప్రకటన చేసింది. మేరీకోమ్ బీజేపీ మాజీ ఎంపీ కాగా దత్ ఆ పార్టీ సభ్యుడు. విచారణ కోసం భారత ఒలింపిక్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కమిటీలో కూడా వీరిద్దరూ సభ్యులే. ఇలాంటి ఆరోపణలు వచ్చిన సందర్భాలలో జరిపే విచారణల్లో క్రీడా శాఖ, ఒలింపిక్ అసోసియేషన్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయి.
గత సంవత్సరం సైక్లింగ్ కోచ్, సెయిలింగ్ కోచ్‌లపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినప్పుడు క్రీడా శాఖ వెంటనే స్పందించింది. ఫిర్యాదు అందగానే వీరిద్దరి కాంట్రాక్టులను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. అంతేకాక మహిళా అథ్లెట్లకు బాసటగా నిలిచే విషయంలో జాతీయ క్రీడా సమాఖ్యలకు మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే ఈ ఇద్దరు కోచ్‌లకూ రాజకీయాలతో సంబంధం లేదు. అందుకే అధికారులు వేగంగా స్పందించారు. కానీ ఇప్పుడు ఆరోపణలు వచ్చింది సాక్షాత్తూ అధికార పార్టీ ఎంపీ పైన. ఆయనపై విచారణ కోసం ఏర్పాటు చేసిన రెండు కమిటీలు నివేదికలు అందించినా వాటిని నేటి వరకూ బయటపెట్టలేదు. కనీసం ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు సైతం ఇవ్వలేదు. ఇది చాలదన్నట్లు భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, ప్రముఖ క్రీడాకారిణి పీటీ ఉష రెజ్లర్లపైనే మండిపడ్డారు. వారిలో క్రమశిక్షణ లోపించిందని ఆరోపించారు. బీజేపీతో 2015 నుండి సంబంధాలున్న అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి కల్యాణ్ చౌబే కూడా రంగంలోకి దిగారు. రెజ్లర్లు దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటూ ఆయన దుయ్యబట్టారు. మహిళా రెజ్లర్లకు పతకాలు వచ్చినప్పుడు వారిని పొగడ్తలతో ముంచెత్తిన ప్రధాని మోడీ ఇప్పుడు మౌనముద్రలోకి జారుకున్నారు. ఇలాంటి నాయకులు మహిళా లోకానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారో గమనించాల్సిన అవసరం ఉంది.










