Apr 19,2023 21:31

న్యూఢిల్లీ: భువనేశ్వర్‌ వేదికగా ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ జూన్‌లో జరగనుంది. ఈ మేరకు ఆలిండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌(ఎఐఎఫ్‌ఎఫ్‌) జనరల్‌ సెక్రటరీ షాజీ ప్రభాకరన్‌ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఫిఫా అండర్‌-17 మహిళల ప్రపంచకప్‌ను సజావుగా నిర్వహించడంతో ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ ఆతిథ్య హక్కులు భారత్‌కు దక్కాయని ఆయన తెలిపారు. జూన్‌ 9నుంచి 18వరకు జరిగే టోర్నమెంట్‌లో ఆతిథ్య భారత్‌తోపాటు లెబనాన్‌, మంగోలియా, వనాటు దేశాలు ప్రాతినిధ్యం వహించనున్నాయి. ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌కు భారత్‌ ఆతిథ్యమివ్వడం ఇది మూడోసారి. 2018లో ముంబయి, 2019లో అహ్మదాబాద్‌ వేదికగా ఈ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ జరిగింది. భారత ఫుట్‌బాల్‌ జట్టు మంగోలియా, వనాటు జట్లతో గతంలో తలపడిన సందర్భం లేదు. భారతజట్టు చివరిసారిగా 2022, జూన్‌ 8న కంబోడియాతో తలపడి 2-0గోల్స్‌ తేడాతో గెలిచింది. ఆ తర్వాత కోల్‌కతా వేదికగా జరిగిన ముక్కోణపు ఫుట్‌బాల్‌ టోర్నీలో భారతజట్టు 1-2గోల్స్‌ తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌, 0-4గోల్స్‌ తేడాతో హాంకాంగ్‌ చేతిలో ఓడింది. ఆ తర్వాత ఇంఫాల్‌ వేదికగా జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారతజట్టు 1-0గోల్స్‌ తేడాతో మయన్మార్‌పై, 2-0తో కిర్గిజ్‌ రిపబ్లిక్‌పై గెలిచింది.