ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :ప్రభుత్వం ప్రకటించిన వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా పరిహారం కౌలు రైతులను నిరాశకు గురిచేసిందని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై రాధాకృష్ణ, పి జమలయ్య, ఉపాధ్యక్షులు ఎం హరిబాబు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఇ-క్రాప్‌లో నమోదైన వారికి పరిహారం ఇవ్వలేదని, యజమానులకు చెల్లించారని తెలిపారు. కొన్ని పంటలకు వాతావరణ బీమా అని, కొన్ని పంటలకు దిగుబడుల ఆధారిత బీమా అని చెప్పి తక్కువ పరిహారం చెల్లించారని పేర్కొన్నారు. కేవలం వరి, అపరాలకు రూ.2,100, రూ.5,060 పత్తికి రూ.3,600 చెల్లించారని వివరించారు. రాష్ట్రంలో మిర్చి పంటలో గుంటూరు జిల్లాలో సగం పంట వేస్తే అక్కడ మిర్చికి బీమా లేకుండా చేయడం దుర్మార్గమని తెలిపారు. అధిక వర్షాల వల్ల పత్తిలో గులాబీ రంగు పురుగు, మిర్చిలో తామర పురుగు వల్ల రెండు పంటలు పూర్తిగా దెబ్బతిని ఎకరాకు మూడు నుంచి ఐదు క్వింటాళ్లు కూడా రాని పరిస్థితి నెలకొందని అన్నారు. ఎక్కువ మంది రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి నష్టపోయిన రైతులందరికీ పరిహారం చెల్లించాలని, కౌలు రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండు చేశారు.










