ప్రజాశక్తి - ముద్దనూరు (కడప) : ప్రమాదవశాత్తు మరణించే పశువులకు బీమా అందించేలా ప్రభుత్వం వైఎస్‌ఆర్ పశు బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని కొత్తపల్లి పశు వైద్యాధికారి వాసా శ్రీనివాస అన్నారు. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో శనివారం వైఎస్‌ఆర్ పశు బీమా పథకాన్ని ప్రారంభించారు. వాసా శ్రీనివాసా మాట్లాడుతూ ... పశు పోషణపై ఆధారపడి జీవనం సాగిస్తున్న చిన్న, సన్నకారు రైతులకు ఆర్ధికంగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ఈ పధకాన్ని అమలు చేసినట్లు చెప్పారు. పశువులవారీగా బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందన్నారు. వివిధ రకాల పశువులవారీగా బీమా ప్రీమియం రూ 384 చెల్లిస్తే రూ.30 వేలు, రూ192 చెల్లిస్తే రూ.15 వేలు, రూ.75 చెల్లిస్తే రూ.6 వేలు వస్తుందన్నారు. ఈ బీమా మూడు సంవత్సరాల వరకు వర్తిస్తుందన్నారు. బీమా వివరాలకై ఆయా పశు కేంద్రాల్లో సంప్రదించాలన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశు వైద్యాధికారి కోరారు.










