Jul 24,2022 07:46
  • 31 శాతమే సాగు
  • ఉమ్మడి అనంతలో 20 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు
  • ప్రత్యామ్నాయం ఏర్పాట్లలో అధికారులు

ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : వంట నూనెల ధరలు మండుతున్నా నూనె గింజల్లో ఒకటైన వేరుశనగ సాగు పట్ల రైతుల్లో మాత్రం నిరాసక్తతే నెలకొంది. పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగొచ్చే పరిస్థితుల్లేవన్న ఉద్దేశంతో ఈ పంట సాగుపై ఆసక్తి చూపడం లేదు. ఖరీఫ్‌లో వేరుశనగ పంట విత్తుకునేందుకు జులై మాసం అనుకూలం. ఈ నెల మూడో వారం దాటినా విత్తనం మూడో వంతు కూడా పడలేదు. ఈ పంట ప్రధానంగా పండే ఉమ్మడి అనంతపురం జిల్లాలో అంతకంటే తక్కువగా సాగులో ఉంది. దీంతో, ఈ ఏడాది వేరుశనగ సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయే సూచనలు కనిపిస్తుండడం తో వ్యవసాయాధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు.
 

                                                              మరో వారంలో దాటనున్న అదును

రాష్ట్ర వ్యాప్తంగా వేరుశనగ పంట సాగు 16.65 లక్షల ఎకరాలు. ఇప్పటి వరకు 5.21 లక్షల ఎకరాల్లోనే వేశారు. సాధారణ సాగులో ఇది 31 శాతమే. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 10.98 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది వేరుశనగ సాగవుతుందని వ్యవసాయాధికారులు అంచనాలు రూపొందించారు. ప్రస్తుతం 3.19 లక్షల ఎకరాల్లోనే సాగులో ఉంది. సాగు విస్తీర్ణంలో ఇది 29 శాతమే. కొత్త జిల్లాల ప్రకారమైతే అనంతపురం జిల్లాలో 6.01 లక్షల ఎకరాలకుగానూ 1.40 లక్షల ఎకరాల్లో, శ్రీ సత్యసాయి జిల్లాలో 4.97 లక్షల ఎకరాలకుగానూ 1.79 లక్షల ఎకరాల్లో మాత్రమే విత్తనం పడింది. ఈ నెల దాటితే వేరుశనగ పంట సాగుకు అదును తప్పుతుంది. మిగిలిన వారం రోజుల్లో ఇంకా మేరకు సాగువుతోందనేది ప్రశ్నార్థకంగానే ఉంది.
 

                                                                        గిట్టుబాటు కానందునే..

పెట్టుబడులు పెరగడం, అందుకు తగ్గట్టు దిగుబడుల్లేకపోవడం, గిట్టుబాటు ధర రాకపోవడం తో రైతులు గత కొన్ని సంవత్సరాలుగా వేరుశనగ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిస్తూ వస్తున్నారు. ఎకరానికి సగటున రూ.30 వేల వరకు పెట్టుబడి అవుతోంది. మూడు, నాలుగు క్వింటాళ్లు కూడా దిగుబడి రావడం లేదు. ప్రస్తుత ధరలను బట్టి ఏడు క్వింటాళ్ల కంటే ఎక్కువ దిగుబడి వస్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట పూర్తిగా చేతికి రాకపోతుండడంతో వేరుశనగ సాగు పట్ల రైతుల్లో నిరాసక్తత నెలకొంటోంది. క్వింటాలుకు ఐదు వేల రూపాయల వరకు మాత్రమే ధర లభిస్తోంది. ఈ లెక్కన నాలుగు క్వింటాళ్లకు కలిపి వచ్చే ఆదాయం రూ.20 వేలకు మించి ఉండడం లేదు.
 

                                                      ఉమ్మడి 'అనంత'లో 20 మండలాల్లో వర్షాభావం

ఒకవైపు ఈ ఏడాది వర్షాలు బాగా పడినట్టు కనిపిస్తోన్నా, మండలాల వారీగా చూసినప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. జూన్‌, జులైలో కలిపి అనంతపురం జిల్లాలో 109.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటివరకూ 104.4 మిల్లీమీటర్లు నమోదైంది. శ్రీ సత్యసాయి జిల్లాలో 123.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటివరకూ 133.2 మిల్లీమీటర్లు నమోదైనట్లు అధికారుల రికార్డులు తెలియజేస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లోనూ మండలాల వారీగా చూస్తే అనంతపురం జిల్లాలో 11 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఇందులో గమ్మగట్ట మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. సత్యసాయి జిల్లాలో తొమ్మిది మండలాల్లో వర్షాభావం నెలకొంది. వేరుశనగ సాగుపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
 

                                                                     నష్టాలే మిగులుతున్నాయి

నిరుడు ఎనిమిది ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాను. ఆగస్టులో వర్షాభావం, పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాల వల్ల. రెండున్నర లక్షల రూపాయలు నష్టపోయాను. వ్యవసాయాధికారిని తీసుకొచ్చి జరిగిన నష్టాన్ని స్వయంగా చూపించాను. నష్టపరిహారం వచ్చేలా చూస్తామని అధికారులు చెప్పారు. ఒక్క రూపాయి కూడా రాలేదు. ఈ సంవత్సరం వేద్దామని విత్తనం తెచ్చినా, వానల్లేక విత్తలేదు. నా పక్క పొలంలో రైతులు ధైర్యం చేసి విత్తనాలు వేస్తే వర్షాభావం వల్ల సగం కూడా మొలకెత్తలేదు. ఈ వారం వాన రాకుంటే విత్తనాలు అమ్ముకోవాల్సిందే. ఏటా నష్టాలే మిగులుతున్నాయి.
                    -ఎర్రిస్వామి, రైతు, సోదనపల్లి గ్రామం, శింగనమల మండలం

                                           ఈ నెలాఖరు వరకు చూసి ప్రత్యామ్నాయం ప్రతిపాదిస్తాం

వేరుశనగ సాగు ఆశించిన మేరకు లేదు. విత్తేందుకు ఇంకా వారం రోజులు సమయముంది. ఇదే పరిస్థితులు కొనసాగితే ప్రత్యామ్నాయంపై దృష్టి సారిస్తాం. ఇప్పటికే సమాచార సేకరణలో ఉన్నాం. నెలాఖరు వరకు ఇలాగే ఉంటే, పరిస్థితులను ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
                                                                           -చంద్రనాయక్‌, జిల్లా వ్యవసాయాధికారి, అనంతపురం