Jul 09,2023 22:16

ఢాకా: బంగ్లాదేశ్‌ పర్యటనలో భారత మహిళల క్రికెట్‌ జట్టు శుభారంభం చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆతిథ్య జట్టును భారత బౌలర్లు 114/5కు కట్టడి చేశారు. షోర్నా అక్తర్‌ (28) టాప్‌ స్కోరర్‌. శోభన మోస్తరీ (23), శతీ రాణి (22) పరుగులు చేశారు. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్‌, మిన్ను మణి, షెఫాలీ వర్మ తలో వికెట్‌ పడగొట్టారు.115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమ్‌ఇండియా.. 16.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. షెఫాలీ వర్మ (0), జెమీమా రోడ్రిగ్స్‌ (11) విఫలమయ్యారు. దీంతో 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌ను హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (54బీ 35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్మఅతి మంధాన (38బీ 34 బంతుల్లో 5 ఫోర్లు) ఆదుకున్నారు. మంధాన నిలకడగా ఆడగా.. హర్మన్‌ప్రీత్‌ దూకుడు ప్రదర్శించింది. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. దీంతో భారత్‌ సునాయసంగా గెలుపొందింది. అర్ధ శతకం బాది జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన హర్మన్‌ప్రీత్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచింది. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టీ20 మ్యాచ్‌ జులై 11న జరగనుంది.