దుబాయ్ : టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ రెండో ర్యాంక్ నుంచి నంబర్‌వన్ ర్యాంక్‌కు ఎగబాకిందని ఐసీసీ బుధవారం మధ్యాహ్నం ప్రకటించింది. దాంతో ఇప్పటికే వన్డే, టి20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న భారత్ టెస్టుల్లోనూ టాప్ ర్యాంక్ అందుకోవడంతో ఏకకాలంలో మూడు ఫార్మాట్‌లలో (టెస్టు, వన్డే, టి20) టీమిండియా నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిందని అభిమానులు సంబరపడ్డారు. కానీ అది కేవలం నాలుగు గంటల సేపే. మరోసారి ఐసీసీ సాంకేతిక తప్పిదం కారణంగా టెస్టు ర్యాంకింగ్స్‌లో మొదట ఆస్ట్రేలియాను వెనక్కినెట్టి భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. తొలి టెస్టులో ఓడిన ఆసీస్ ఏకంగా 15 పాయింట్లు కోల్పోయి రెండో ర్యాంకుకు దిగజారిందని మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఐసీసీ వెబ్‌సైట్లో పెట్టింది. కానీ మళ్లీ తప్పిదాన్ని తెలుసుకుని రాత్రి 7 గంటల సమయంలో సరిదిద్దుకుంది. దీంతో ఆసీస్, భారత్ వరుసగా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుత టెస్టు ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా 126 రేటింగ్‌తో టాప్ ర్యాంక్‌లో, భారత్ 115 రేటింగ్‌తో రెండో ర్యాంక్‌లో ఉన్నాయి.










