Jun 28,2023 09:23
  • అక్టోబర్‌ 5న ఇంగ్లండ్‌ × న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో షురూ
  • ఉప్పల్‌లో మూడు మ్యాచ్‌లు
  • వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసిసి

దుబాయ్ : ఐసిసి వన్డే ప్రపంచ కప్‌ షెడ్యూల్‌ విడుదలైంది. భారత్‌ వేదికగా అక్టోబర్‌లో జరిగే ఈ మెగా టోర్నీలో మ్యాచ్‌ల షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో 13వ ఐసిసి వన్డే ప్రపంచకప్‌ టోర్నీ సమరం మొదలుకానుంది. టైటిల్‌కై మొత్తం 10జట్లు తలపడనున్నాయి. ప్రతి జట్టు లీగ్‌ దశలో 9మ్యాచ్‌లు ఆడనుంది. లీగ్‌ దశ ముగిసిన తర్వాత టాప్‌-4లో ఉన్న జట్లు సెమీఫైనల్స్‌ ఆడనున్నాయి. అక్టోబర్‌ 8న ఆస్ట్రేలియాతో భారత్‌ తన తొలి మ్యాచ్‌ లో తలపడనుంది. అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 15న భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య హై-టెన్షన్‌ మ్యాచ్‌ జరగనుంది. నవంబర్‌ 15, 16న ముంబ యి, కోల్‌కతా వేదికగా సెమీఫైనల్‌, అహ్మదాబాద్‌ వేదికగా నవంబర్‌ 19న ఫైనల్‌ మ్యాచ్‌ ఉంటుంది. రెండు సెమీఫైనల్స్‌తో పాటు ఫైనల్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే(నవంబర్‌ 20) ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో మూడు మ్యాచ్‌లు జరగనున్నా యి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స్టేడియంకు ఒక్క మ్యాచ్‌నూ కేటాయించలేదు. ధర్మశాల, ఢిల్లీ, లక్నో, పుణె, ముంబయి, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా వేదికలుగా మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. పాకిస్తాన్‌ రెండు వేదికలు (చెన్నై, బెంగళూరు) తమకు అనుకూలంగా లేవంటూ అభ్యంతరం వ్యక్తం చేసినా.. ఐసిసి ఆ ప్రతిపాదనను త్రోసిపుచ్చి షెడ్యూల్‌ ప్రకారమే టోర్నీ జరగనున్నట్లు ప్రకటించింది. 1987లో భారత్‌- పాకిస్తాన్‌, 2011 లో భారత్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు కలిసి సంయు క్తంగా ప్రపంచకప్‌ టోర్నీలకు ఆతిథ్య మివ్వగా.. తొలిసారి ప్రపంచకప్‌ టోర్నీ మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే జరగడం చరిత్రలో ఇదే తొలిసారి.

111