Aug 11,2022 07:03

''మతతత్వం బుజ్జగించటానికి, రాజీ పడటానికీ సాధ్యం కాని ఒక సిద్ధాంతం. దానిని దాని వ్యతిరేక సిద్ధాంతపరంగానే గట్టిగా ఎదుర్కోవాలి. బలంగా తిప్పికొట్టాలి. అంతకుమించిన దారి మరొకటి లేదు.''
- ప్రఖ్యాత చరిత్రకారుడు బిపన్‌ చంద్ర

మతం అనేది వ్యక్తిగత పరిధిలోనే ఉన్నప్పుడు దాని వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు పెద్దగా కనిపించపోవొచ్చు. కానీ, దానిలో రాజకీయం చొరబడి మతతత్వంగా మారితే ... సమాజాన్ని కార్చిచ్చులా చుట్టుకొని భస్మీపటలం చేస్తుంది. విద్వేషం, విధ్వంసాల పరంపరను సృష్టిస్తుంది. అలాంటి మహా భయంకరమైన విధ్వంసం, విషాదం మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు చోటు చేసుకొంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సంబరం కంటే- దేశ విభజన కారణంగా తలెత్తిన రణ రక్తసిక్త విద్వేష వాతావరణమే చాలామంది హృదయాల్లో ఆనాడు చెరగని బీభత్స ముద్ర వేసింది! మతతత్వం మనుషులను ఎంత భయంకరంగా విభజిస్తుందో, ఎంత భయానకంగా ద్వేషిస్తుందో, ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తుందో, ఎంత అమానవీయంగా నడుచుకుంటుందో చెప్పటానికి రక్త దు:ఖచారికలుగా మిగిలిన చరిత్రే ఒక పాఠం!

india


మతంవారీ విభజన మొదలు ...
ఒకపక్క జాతీయోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం కులమతాలకు అతీతంగా ప్రజలను ఏకం చేస్తుంటే- రాజకీయ స్వార్ధ ప్రయోజనాలను ఆశించిన నాయకులు మతతత్వం రాజేయడం మొదలు పెట్టారు. 1937 నాటికి అది మరింత తీవ్రస్థాయి దాల్చింది. జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చాడు. ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా అదే పాట పాడింది. ''ఈ దేశంలో ఇతర మతాలను అణచివేసి హిందూరాజ్యం స్థాపించాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది.'' అని జిన్నా రెచ్చగొట్టుడు ప్రసంగాలు మొదలెట్టాడు. గాంధీ మీద తీవ్ర విమర్శలు చేశాడు. మరోపక్క ఆర్‌ఎస్‌ఎస్‌దీ అదే వరస! ''సొంత గడ్డ మీద హిందువులను బానిసల స్థాయికి దిగజార్చుతున్నారు.'' అని సావర్కర్‌ ప్రచారం ప్రారంభించాడు. ''హిందువు దుర్బలుడు. అశక్తుడు. స్ఫూర్తి లేనివాడు.'' అని వ్యంగ్యంగా ఈసడిస్తూ... ముస్లిముల మీద వ్యతిరేక భావం పెంచేవిధంగా ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త గోల్వాల్కర్‌ రెచ్చగొట్టుడు రాతలూ, ప్రసంగాలూ ఆరంభించాడు.
చాప కింద నీరులా ...
జాతీయోద్యమం నడుస్తుండగానే, లక్షలాది హిందూ ముస్లిం ప్రజలు భుజం భుజం కలుపుకొని ముందుకు సాగుతుండగానే, మతాలకు అతీతంగా అనేకమంది నాయకులు స్వరాజ్యం కోసం పోరాడుతుండగానే- ముస్లిం లీగ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చాపకింద నీరులాగ మతతత్వాన్ని విస్తరింపచేశాయి. 1947 నాటికి అది పతాక స్థాయికి చేరింది. పోతూ పోతూ బ్రిటీషు వాళ్లు మన దేశాన్ని రెండు ముక్కలుగా చీల్చటానికి, ఇంకా అనేక కార్చిచ్చులు రగిలించటానికి కారణమైంది.
స్వాతంత్య్రం రావడం ఖాయమని తేలిపోయాక- దేశం రెండుగా విడిపోవాలనే వాదన మతతత్వవాదుల్లో ఉధృతమైంది. మరోపక్క కాంగ్రెస్‌లో అధికారం కోసం ముఠా తగాదాలు మొదలయ్యాయి. వివిధ కారణాలతో రెచ్చగొడుతూ, దేశంలో చాలాచోట్ల మత కొట్లాటలు చోటు చేసుకున్నాయి. తూర్పు బెంగాల్లో మైనార్టీలుగా ఉన్న హిందువుల మీద దాడులు జరిగాయి. గాంధీ అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు కృపలానీని వెంటబెట్టుకొని అక్కడికి వెళ్లాడు. ఈలోగా బీహార్లో మత గొడవలు తలెత్తాయి. ఒకదానికి ఒకటి ప్రతీకారంగా మతతత్వవాదులు ప్రజలను రెచ్చగొట్టారు. ఈ పరిణామాలు గాంధీని తీవ్రంగా బాధించాయి. ''గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు నా అహింసా సిద్ధాంతం పరీక్షకు గురవుతోంది.'' అని పటేల్‌కు లేఖ రాశాడు ఆయన. ప్రజల మధ్య ఐక్య స్ఫూర్తి దెబ్బ తింటున్నందుకు, హిందూ - ముస్లిం విబేధాలు దారుణ మారణ కాండకు దారి తీస్తున్నందుకు గాంధీ చాలా చింతించాడు. అధికార మార్పిడికి ఢిల్లీలో సన్నాహాలు జరుగుతున్న సమయంలో- తాను ప్రజల మధ్య సామరస్యం సాధించటానికి బీహార్లోనూ, తూర్పు బెంగాల్లోనూ ఉండి పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. బెంగాల్లోనూ, బీహార్లోనూ కిసాన్‌ సంఫ్‌ు ఆధ్వర్యాన సాగిన రైతు ఉద్యమాలు .. మత కొట్లాటలను శక్తిమేర ప్రతిఘటించాయి.
దేశం రెండు ముక్కలైంది!
ఇండియా వైస్రాయిగా 1947 మార్చి 24న వచ్చిన మౌంట్‌ బాటన్‌ ... ఏప్రిల్‌లో రాజకీయ పక్షాలతో చర్చలు జరిపాడు. తరువాత 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి దేశ విభజన, స్వాతంత్య్ర ప్రకటన చేశాడు. ముస్లిం లీగు, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రేరేపించిన మతతత్వం విజృంభించి, దేశం రెండుగా విడిపోయింది. కానీ, విభజన కాంక్ష అక్కడితో ఆగలేదు. పంజాబు, బెంగాల్‌ రాష్ట్రాలను విభజించాలని కాంగ్రెస్‌ డిమాండు చేసింది. అస్సాంని కూడా విడగొట్టాలని లీగ్‌ కోరింది. పంజాబులో రెండు ప్రాంతాలను కలిపి ప్రత్యేక సిక్కు రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని అకాలీలు డిమాండు పెట్టారు. బెంగాల్‌లోని లీగ్‌ నాయకులకు, జిన్నాకు మధ్య విభజన విషయంలో భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. మతపరమైన విభజన ఎన్నెన్ని సమస్యలకు దారి తీస్తాయో చెప్పటానికి ఇవన్నీ ఉదాహరణలు.
స్వాతంత్య్ర ఉత్సాహం ఉవ్వెత్తున లేవాల్సిన 1947 ఆగస్టు 15.. మత కలహాల నీడతో అంధకారమై పోయింది. మత ప్రతిపాదికన ప్రజలు తమ తమ ఇళ్లను, ఆస్తులను వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. అదే సందర్భంలో పిచ్చెక్కిన మతోన్మాదం దాడులకు, దౌర్జన్యాలకు బరి తెగించింది. హత్యలూ, అత్యాచారాలూ, అత్యంత అమానవీయ సంఘటనలూ చోటు చేసుకున్నాయి. రైళ్లు రక్తసిక్త మృతదేహాలతో, అగమ్య గోచర విషాద వదనాలతో ప్రయాణించాయి. వేలాదిమంది ప్రజలు తమ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా తమదైన నేలను వదిలి, తమది కాని గడ్డ మీదికి కేవలం మతం ప్రతిపాదికన కాందిశీకులుగా తరలిపోవాల్సి వచ్చింది. మధ్యదోవలోనే ఎంతోమంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. మహిళలను ఎవరెవరో బలవంతంగా లాక్కెళ్లిపోయి, అత్యాచారాలకు పాల్పడ్డారు. వేలాదిమంది బాలబాలికలు తమ తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి, అనాథలైపోయారు. ప్రజలకు అవసరమూ, ఆమోదమూ లేని దేశ విభజన సృష్టించిన ఇలాంటి విషాద, విచారకర దృశ్యాలెన్నో!
ఏ మతం వారికైనా దైనందిన జీవనావసరాలు ఒక్కటే! సహజంగానే వాటి చుట్టూనే మానవ సంబంధాలు, సంఘర్షణలూ ఏర్పడతాయి. మతతత్వం వాటిని సంకుచిత ఆలోచనలతో, ద్వేషంతో విచ్ఛిన్నం చేస్తుంది. మొలక దశలో ఉన్నా, మహా రక్కసి దశలో ఉన్నా మతతత్వాన్ని మనం గట్టిగా వ్యతిరేకించాలి. ప్రజల మధ్య సామరస్యానికి మించిన సౌఖ్యమూ, సౌందర్యమూ ఇంకేమీ లేదని చాటి చెప్పాలి.